Kolkata Doctor Case : 3 దశాబ్దాలలో ఎన్నడూ చూడలేదంటూ బెంగాల్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం
సొలిసిటర్ జనరల్ వాదనల తర్వాత అసహజ మరణంగా మొదట కేసు నమోదు చేశారని...
Kolkata Doctor Case : కోల్‌కతాలో ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ అభ్యయ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారంటూ కోల్‌కతా ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ విషయంలో నిబంధనలు పాటించలేదని, ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారంటూ కోర్టు అభిప్రాయపడింది. ఓ విధంగా సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. 30 ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివాలా పేర్కొన్నారు. కేసు డైరీ హార్డ్ కాపీ సమర్పించాలని కోల్‌కతా పోలీసులను సుప్రీంకోర్టు కోరింది. ఘటన జరిగిన చాలాసేపు తర్వాత కేసు నంబరు నమోదు చేసినట్లు తెలుస్తోందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో కోల్‌కతా పోలీసులు పనిచేసిన తీరు సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించలేదన్నారు. వారి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. ఈ కేసు చాలా షాకింగ్‌గా ఉందన్న న్యాయస్థానం సీబీఐ, కోల్‌కతా పోలీసుల నివేదికల మధ్య ఎందుకు వ్యత్యాసం ఉందని ప్రశ్నించింది.
Kolkata Doctor Case – Supreme Court Serious
ఆర్ జీ కర్ వైద్యకళాశాల, ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ కేసు విచారణకు సంబంధించి సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఉదయం ఘటన జరిగితే రాత్రి 11.30 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదైందని, ఆసుపత్రి వైద్యుల నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదుకాలేదని, బాధితురాలి తండ్రి అభ్యర్థన మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. సొలిసిటర్ జనరల్ వాదనల తర్వాత అసహజ మరణంగా మొదట కేసు నమోదు చేశారని. తర్వాత కేసు నంబరు నమోదు చేసినట్లు తెలుస్తోందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఏఎస్పీ తీరు చాలా అనుమానాస్పదంగా ఉందని సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొంది. శవ పంచనామా ఎప్పుడు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా.. సాయంత్రం 4.20 గంటల తర్వాత జరిగిందని కోల్‌కతా(Kolkata) పోలీసుల తరుపున వాదిస్తున్న కపిల్ సిబల్ తెలిపారు. ఈ కేసులో కోల్‌కతా పోలీసులు పనిచేసిన తీరు సరికాదని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించలేదన్నారు. పోలీసుల చర్యలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయని తెలిపారు.
సీబీఐ సమర్పించిన నివేదిక, కోల్‌కతా(Kolkata) పోలీసుల నివేదికకు ఎందుకు తేడా ఉందని సీబీఐను జస్టిస్ పార్దీవాలా ప్రశ్నించారు. హత్యకు ముందు అభయను వేధించారని, కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ తరుపున సొలిసిటర్ జనరల్ తెలిపారు. అంత్యక్రియల అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ విషయంలో ఆసుపత్రి పాలకవర్గం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. నేరం జరిగిన ప్రదేశాన్ని భద్రపర్చలేదని, ఈ ఘటనపై కుటుంబసభ్యులకు ఆలస్యంగా సమాచారం అందిందన్నారు. ఇది ఆత్మహత్య కాదు.. హత్య అని కుటుంబసభ్యులు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో ధర్మాసనం జోక్యం చేసుకుని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. సంఘటన స్థలాన్ని ఎందుకు భద్రపరచలేదని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యం అయిందని, దర్యాప్తు నిబంధనలను ఎందుకు విస్మరించారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Also Read : D Raja CPI : మోదీ ప్రభుత్వం కాశ్మీర్ శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైంది