Konda Surekha : ‘జాగృతి’ అబద్దం కవిత నాటకం – కొండా
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి సురేఖ
Konda Surekha : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ(Konda Surekha) నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ,తనయురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఏకి పారేశారు. లిక్కర్ స్కాం నుంచి తప్పించు కునేందుకు తండ్రీ, కూతుళ్లు నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు.
తెలంగాణ జాగృతి సంస్థను అడ్డం పెట్టుకుని కొత్త నాటకానికి తెర లేపిందని మండిపడ్డారు. ఒకప్పుడు బతుకమ్మ పేరుతో రాజకీయం చేసిన కవిత ఇప్పుడు జాగృతి పేరుతో తప్పించు కునేందుకు నానా తంటాలు పడుతోందన్నారు. తాను చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు స్పందించాలని ప్రశ్నించారు.
తప్పు చేయక పోతే నేరుగా విచారణకు హాజరు కావాలని, కానీ తానేదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడటం దారుణమన్నారు. గతంలో ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తే జనం నమ్మారని కానీ ఇప్పుడు సేమ్ సీన్ తో రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు కొండా సురేఖ(Konda Surekha).
జాగృతి సంస్థ పేరుతో ఎమ్మెల్సీ కవిత దేశ, విదేశాల నుంచి కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. బతుకమ్మ పేరుతో ఆ సంస్కృతికి, పండుగకు తలవంపులు తీసుకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగాక, తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయం పట్టుకుందని అందుకే కొత్త నాటకానికి స్క్రిప్టు తయారు చేసిందన్నారు.
తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న అమరుల గురించి ఏనాడైనా మాట్లాడిందా అని కవితను ప్రశ్నించారు కొండా సురేఖ. ముందు ఆ ధ్వంసం చేసిన 10 ఫోన్లు ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు కొండా సురేఖ.
Also Read : కాంగ్రెస్ లో కల్లోలం కమిటీలపై ఆగ్రహం