#RealityCheck : అహం వీడి వాస్తవంలో జీవించాలి

Reality Check : వాస్తవం ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది-స్వచ్ఛమైనది. వాస్తవాన్ని విడిచి, అహం లో జీవించడం జ్ఞానాన్ని మొద్దు నిద్దురలో ముంచి, అజ్ఞానాన్ని పెంచి పోషించడమే. అయితే వాస్తవ ప్రపంచంలో జీవించడం మనమంతా ఏనాడో మరచిపోయాము.

Reality Check : వాస్తవం ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది-స్వచ్ఛమైనది. వాస్తవాన్ని విడిచి, అహం లో జీవించడం జ్ఞానాన్ని మొద్దు నిద్దురలో ముంచి, అజ్ఞానాన్ని పెంచి పోషించడమే. అయితే వాస్తవ ప్రపంచంలో జీవించడం మనమంతా ఏనాడో మరచిపోయాము. నిజం,నిజాయితీ పనికి రాని,అంతుచిక్కని బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది. అబద్ధానికున్నంత శక్తి నిజానికి లేదు. నిజం నిందలపాలై అబద్ధం విశ్వమంతా చుట్టేసింది. నిజాయితీ నిలువెల్లా దహించబడుతున్న రోజులివి. నిజానికి నిలువెల్లా గాయాలే. అవాస్తవమే అమృతం లా మారిన నేపథ్యంలో మానవ ప్రపంచం ఇంతకంటే సన్మార్గంలో పయనిస్తుందనుకోవడం  అత్యాశే కాగలదు. మానవ సమాజంలో జరిగే ప్రతీ అవాంఛనీయ మైన సంఘటనకు మూల కారణం మనల్ని మనం వంచించుకుని వాస్తవాన్ని విస్మరించి, అబద్ధంలో,అహంలో జీవించడమే.

మనం ఏదయినా ఒక మంచి పని చేసేటప్పుడు మన మనసుకు ఎంతో తృప్తి కలుగుతుంది.అలాంటి తృప్తి మరికొన్ని పనులకు ప్రేరణనిస్తుంది.అయితే కాల క్రమంలో ఈ లక్షణం ఒక తీవ్ర స్థాయికి చేరి, మన వ్యక్తిత్వాన్ని దహించే పరిస్థితి ఏర్పడుతున్నది. తద్వారా మనలో సహజసిద్ధంగా నిగూఢమైన గర్వం చైతన్యమై పతాక సన్నివేశానికి  దారితీస్తున్నది.అన్నీ” నేనే”(Reality Check)  అనబడే భావనకు దారితీస్తున్నది.  స్వచ్ఛమైన మానవ ధర్మంలో  అహం ప్రవేశిస్తే  దానివలన వ్యక్తిత్వం మంట గలుస్తుంది. మనం ఏ చిరు సత్కార్యం చేసినా, అది మన ఆత్మతృప్తి కోసమే. ఇందులో ఎలాంటి సంశయం లేదు.  మనం చేసే మంచి పనిలో స్వార్ధం ప్రవేశించరాదు. స్వార్ధ చింతనలేని సత్యార్కం వలన  గుర్తింపు రావడం కూడా  సహజం.ఇది కాదనలేని సత్యం. ఆత్మ తృప్తి వలన మనశ్శాంతి కలుగుతుంది. సమాజ పరంగా, వ్యక్తిత్వ పరంగా ఉభయతారకంగా పనిచేసే విధంగా ఉండే ఒక అరుదైన మానసిక ఉల్లాసం “సేవా భావం”వలన కలుగుతుంది. సమాజ సేవలో తరించడమంటే అనంతమైన మానసిక ఉల్లాసాన్ని పొందడమే.

ఇది భౌతికమైనది కాదు. మానసిక పరమైనది. పరహిత సత్యార్యంలో సంకుచితభావానికి తావులేదు. మంచితనం అనే  భావాన్ని కేవలం భౌతికంగా అన్వయిస్తే అది అహానికి దారితీస్తుంది. మనం ఏచిన్న మంచి పని చేసినా, దానిని భౌతికంగా అన్వయించుకోకూడదు.  మనం చేసే ఒక మంచి పనిలోనే దైవాన్ని గాంచాలి. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శతో ముందుకు సాగాలి. మన పాదాలు నేల మీదే ఉండాలి. మనం ఒదిగే ఉండాలి. అహం దరిచేరితే గర్వం ప్రవేశిస్తుంది. గర్వాన్ని  దరిచేరనీయకుండా మనమంతా ఈ అనంత విశ్వంలో కేవలం అల్పులం,అజ్ఞానులం అని భావించుకుంటూ వెలుతురు వైపు  సాగితేనే యథార్ధదర్శనం కలుగుతుంది. అలా కాకుండా గర్వాన్ని పెంచుకుంటూ పోతే మానవ ధర్మానికే అర్ధం మారిపోతుంది. ఏ చిన్న సత్కార్యం చేసినా మనం జన్మించినందుకు మనం ఈ జగతికి చేసే ఒక నీటి బిందువంత ప్రత్యుపకారం మాత్రమే అని జ్ఞప్తియందుంచుకోవాలి.చావుపుట్టుకలకు అతీతమైనది జ్ఞానం(Reality Check). అహం అనేది అజ్ఞానం నుండి జనించేది.

అహం వీడితే వాస్తవం కనుల ముందు సాక్షాత్కరిస్తుంది.అహం అనే భావన త్యజిస్తే మిగిలేది కేవలం తానే…ఏమీ లేని “నేనే’. మనం పుట్టేటప్పుడు మనతో ఏమీ లేవు…పోయేటప్పుడు ఏవీ మనతో రావు. ఇది యథార్ధం. ఇదే నిత్యం..ఇదే సత్యం. యథార్ధం కంటకప్రాయం గా మారిన నేపథ్యంలో యథార్ధవాదులు లోక విరోధులుగా మిగులుతున్నారు. మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మౌనధారణ కూడా మంచి ని చంపేసే ఆయుధంగా మారడం దురదృష్టకరం. అయినప్పటికీ  లోకంలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ  పరిణామాలకు మనం ఉత్ప్రేరకం గా మారకూడదు. సర్వకాల సర్వావస్థలయందు విజ్ఞతనెరిగి ప్రవర్తించడమే మేలు. లేకుంటే మౌనాన్ని ఆశ్రయించడమే మేలు.

మంచిని ప్రోత్సహించడం,మంచిని పెంచడం కూడా నిజమైన మానవ సేవ గానే పరిగణించాలి. సద్భుద్ధితో సత్సాంగత్యం లో జీవితం గడపాలి. బ్రతికితే కోయిలలా జీవించాలి. సజ్జన సాంగత్యం లో జీవించి, గతించాలి. “అబద్ధం” ప్రపంచాన్ని చూట్టేస్తే “నిజం” గడప కూడా దాటలేని పరిస్థితుల్లో ప్రపంచ గమనం సాగుతున్నది. ఒంటరి గానైనా,అనాథగానైనా కోయిలలా జీవించి గతించాలి. అంతరాత్మ ప్రబోధంతో నిస్వార్ధ జీవనం సాగించాలి.గర్వం అంతరాత్మ గొంతును నొక్కేస్తే  నిజం మూగవేణువులా రోదిస్తుంది. మనం మన సేవా ధర్మంతో మంచిని పెంచాలి.గర్వాన్ని కాదు. ప్రతీ పనిలో ఇదే భావం కనబరచాలి. అత్మతృప్తి  ఆత్మస్తుతికి మార్గం కారాదు.ఈ విశాల భావం మన మనసులో ఉన్నంత వరకు  గౌరవం,గుర్తింపు కూడా వాటంతటవే ప్రాప్తిస్తాయి.  బలవంతంగా తీసుకుంటే రావు. అహాన్ని దరిచేరనీయకూడదు- గర్వాన్ని ఆదిలోనే త్రుంచివేయాలి. విశ్వమంతా ఈ భావాన్ని అనుసరించాలి.నేను ‘నేను’ గా ఉన్నప్పుడే నిజమైన జ్ఞానం అలవడుతుంది. నేను అంటే ఏదో మరేదో..అనే భౌతిక పరమైన భావనకు తీసుకపోయి,కాల్పనిక మైన సౌధాల్లో విహరించడం- నేలను విడిచి సాము చేయడమే.

వాస్తవం లో జీవించి” నేను నేనే”(Reality Check) నాతో ఏమీ లేదు. ఏమీ రావు, చిత్తశుద్ధితో కూడిన  సత్కార్య ఫలం తప్ప అనే భావన ఉత్తమమైనది. ” నేను” అనే భావనకు గర్వం,అసూయ, అహంకారం వంటి కృత్రిమమైన ఆభరణాలు సన్మార్గం నుండి  తప్పించి పతనం వైపు పయనింపచేస్తాయి. అహం పనికిరాదు. మనం అజ్ఞానులం అనుకుని జ్ఞానం వైపు పయనించాలి. మనం కేవలం మానవ మాత్రులం. అహం వీడి జీవించడం అసాధ్యం. కొంతలో కొంతైనా దాని తీవ్రతను తగ్గించుకోవడమే మనముందున్న ఉత్తమ పరిష్కారం. నిజాన్ని కొంతవరకైనా బ్రతికించగలగాలి. అవాస్తవం ప్రబలితే అన్యాయమైపోయేది సమాజమే.మన పరిజ్ఞానం అసంపూర్ణం. అహం మనల్ని మరింత అధః పాతాళంలోకి తొక్కేస్తుంది.సర్వత్రా అహం నిండిన లోకంలో ఇది కష్టసాధ్యం. ఒక చెంప మీద కొడితే,రెండో చెంప చూపించే రోజులు పోయాయి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. సహృదయముంటేనే ముచ్చట్లు. అహం వలన జనించిన దుర్గతిని  రూపుమాపడం మన తరమా?  కాలమే సమాధానం చెప్పాలి.

No comment allowed please