#TeluguLegend : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్

Magdum Mohiuddin, a Telangana armed struggle fighter

హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్. భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు తన జీవితాన్ని అంకితమిచ్చాడు. మొక్కవోని ధైర్యంతో కులమతాల కతీతంగా పేదల పక్షాన నిలిచి వారి అభ్యున్నతికి ఆయన కృషి చేశాడు.

మగ్దూం మొహియుద్దీన్ ప్రముఖ అధ్యాపకుడు, ఉర్దూ కవి. ‘షాయరే ఇంక్విలాయ్’ (ఉద్యమ కవి, విప్లవ రచయిత) బిరుదాంకితుడు. కవియేగాక నాటక కర్త, గాయకుడు, నటుడు కూడా. ఇతని గజల్ లు, పాఠ్యాంశాల లోను, సినిమాల లోనూ ఉపయోగించాడు. ఆయన రాసిన ‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ ‘ఎక్ చంబేలీకె మండ్వే తలే’ అనే గీతాలు ప్రసిద్ధి పొందాయి. ఉర్దూ మహా కవిగా ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు.

మగ్దూం మొహియుద్దీన్ తెలంగాణ లోని మెదక్ జిల్లా ఆందోల్లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. ఆయన పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియొద్దీన్ ఖాద్రి. అయన పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్‌లో ఉండేవాడు. ఆయన తాత (తల్లితండ్రి) రషీదుద్దీన్ ఔరంగజేబు సైన్యాలతో పాటు దక్కన్ పీఠభూమికి వచ్చాడు.

అలాగే, మరో తాత (తంవూడికి తండ్రి) సయ్యద్ జాఫర్ అలీ కూడా ఉత్తర ప్రదేశ్ షాజహానాబాద్ నుండి 1857లోనే దక్షిణానికి వచ్చాడు.ఆ కుంటుంబ మంతా హైద్రాబాద్ దక్కన్ పరిసరాలకు చేరింది. ఆయన తండ్రి గౌస్ మొహియొద్దీన్ నిజాము ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పని చేసేవాడు. బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన ‘గోథే ప్రేమ లేఖలు’ ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చు వేసింది.

నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930-40లలో హైద్రాబాద్‌లో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వర రావు, గులాం హైదర్, రాజ బహుదూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పని చేస్తుండేవాడు. అక్తర్ హుస్సేన్ రాయ్‌పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాద్‌లో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు.

సరోజినీ నాయుడు నివాసమైన గోల్డెన్ త్రెషోల్డ్లో డాక్టర్ జయసూర్య, జె.వి.నరసింగరావు లతో కలిసి సాహిత్య, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతుండే వాడు. చార్మినార్ సిగట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, అల్విన్, షాబాద్ సిమెంట్, ఎన్ ఎస్సార్ రైల్వే ఎంప్లాయిస్, ఎలక్ట్రిసిటీ, సి.డబ్ల్యు.డి. మున్సిపాలిటీ, బటన్ ఫ్యాక్టరీ వంటి వందల కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహో రాత్రులు వారి సంక్షేమం కోసం కృషి చేశాడు.

స్టేట్ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా ఆయన వాగ్ధాటికి ఎదురుండేది కాదు. విషయం సూటిగా, స్పష్టంగా, దృఢంగా, బలంగా చెప్పేవాడు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసన మండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలో కొనసాగాడు.

మఖ్దూం కార్మిక నాయకుడు, శాసన మండలి సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసి అమరుడైనాడు. కమ్యూనిస్టు అయిన మఖ్దూం మతాన్ని దూషించ లేదు, అనుసరించ లేదు.

హైద్రాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరాటానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం. హైద్రాబాద్ రాష్ట్ర శాసన సభ్యుడు (1952) శాసన మండలి సభ్యుడు, ప్రతిపక్ష నేత (1956-1969), భారత కార్మిక వర్గ విప్లవ చరివూతలో ముఖ్య పాత్రధారి. ఎఐటియుసికి జాయింట్ సెక్రటరీ. నిజాముకు వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించాడు.

ఢిల్లీలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సమాఖ్య (ఎ.ఐ.టి.యు.సి.) జాయింట్ సెక్రటరీగా కొంత కాలం ఢిల్లీలో ఉన్నాడు.1952-55 మధ్య చైనా, సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు తిరిగి వచ్చాడు. ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యాలయం వియాన్నాలో (1953-54) పనిచేశాడు.

1969, ఆగష్టు 25 తేదీన గుండె పోటుతో ఢిల్లీలో చనిపోయాడు. ఆయన పేరిట హైద్రాబాద్, హిమాయత్‌ నగర్‌లో సి.పి.ఐ. రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్ భవన్ నిర్మించారు.

No comment allowed please