కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. అధికారంలో ఉన్న బీజేపీపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. ఈసారి 224 సీట్లలో 150కి పైగా వస్తాయని ధీమాతో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించారు. మరో వైపు ఇదే రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కర్ణాటకపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున్ ఖర్గే బుధవారం బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లను ఏకి పారేశారు. ఈ దేశంలో ఆకలిని అంతం చేసేందుకు ఆనకట్టలు నిర్మించామని, హరిత విప్లవాన్ని , పాల విప్లవాన్ని తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. పాఠశాలలు, కాలేజీల, యూనివర్శిటీలను నెలకొల్పింది కూడా తామేనని అన్నారు.
ఇవాళ తామేదో సాధించామని ప్రచారం చేసుకుంటున్న మోదీ, అమిత్ షాలు ఇద్దరూ తాము ఏర్పాటు చేసిన బడుల్లోనే చదువుకున్నారన్న విషయం మరిచి పోతే ఎలా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి అనేది లీగల్ గా మారిందని, ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించిన ఘనత సీఎం బొమ్మైకే దక్కుతుందని ఆరోపించారు మల్లికార్జున్ ఖర్గే.