#MelvinJones : నేడు లయన్స్ క్లబ్స్ సేనల సేవలను విశ్వవ్యాప్తం చేసిన మెల్విన్ జోన్స్ జయంతి
Melvin Jones birthday who made Lions Clubs universal
Melvin Jones : ప్రపంచవ్యాప్తంగా 207లకు పైగా దేశాలలో 46,000లకు పైగా లయన్స్ క్లబ్బులతో 1.4 మిలియన్ల స్వచ్ఛంధ సేవా కార్యకర్తలు అనునిత్యం జనహిత సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజాభివృద్ధికి తమ సమయం, సంపద మరియు మేధస్సును వినియోగిస్తూ, ‘మేము సేవలందిస్తాం (వి సర్వ్)’ అనే నినాదంతో కోట్ల డాలర్లను వెచ్చించి అభాగ్యుల ముఖాల్లో నవ్వులకు కారణం అవుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంధ సేవా సంస్థగా పేరుగాంచిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్’ స్థాపనకు 1917లోనే ‘మెల్విన్ జోన్స్(Melvin Jones )’ అంకురార్పన చేశారు.
చికాగో(అమెరికా)కు చెందిన సేల్స్‌మెన్ మెల్విన్ జోన్స్ దయాగుణం, ఆకర్షణీయ వ్యక్తిత్వం, ఉన్నత లక్ష్యం, నిస్వార్థ సేవాతత్వం కారణంగా తను నాటిన లయన్స్ విత్తనం ఓ మహావృక్షమై సేవా శాఖలుగా విస్తరించి, గత శతాబ్దకాలంగా నిరుపేదలకు నీడనిచ్చే స్థితికి చేరడం విశేషం. సన్నిహిత స్నేహితులు లయన్స్ క్లబ్బులుగా ఏర్పడి నిస్వార్థ సేవలను చేయడమనే ఏకైక ఉన్నత లక్ష్యమే పునాదిగా లయన్స్ క్లబ్బులు పని చేస్తున్నాయి. సేవాగుణం మరియు సామాజిక భాద్యత కలిగిన సంపన్న పౌరులు సేవలందించే మంచి వేదికగా లయన్స్ సంస్థ శాఖోపశాఖలుగా విశ్వవ్యాప్తం కావడంలో మెల్విన్ జోన్స్ (Melvin Jones )పాత్ర వెలకట్ట లేనిది.
13 జనవరి 1879న అరిజోన(అమెరికా)లో జన్మించిన మెల్విన్ జోన్స్ వృత్తిరీత్యా ఇన్సురెన్స్ సేల్స్‌మెన్ ఉద్యోగంతో చికాగోలో స్థిరపడ్డారు. తన మిత్రులు మరియు సేవాగుణం కలిగిన పౌరులతో కలిసి సమాజహిత సేవాకార్యక్రమాలను చేయాలనే ఆలోచనతో 07 జూన్ 1917న లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థను ప్రారంభంచారు. అనంతరం తన వృత్తిని వదిలి, జీవితాంతం లయన్స్ క్లబ్స్ సేవల విస్తరణకు మాత్రమే తన జీవితాన్ని అంకితం చేశారు.
లయన్స్ క్లబ్బులు ప్రముఖ పట్టణాలలో వేగంగా విస్తరించడంతో దృష్టి పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణ, రక్త మరియు అవయవ దానాలు, డయాబెటిస్ అవగాహన, అన్నదానాలు, అనాథాశ్రమ సేవలు, కృత్రిమ అవయవాల ఉచిత వితరణలు, వైద్య శిబిరాలు, ప్రభుత్వాలకు చేయూత, అవగాహన కార్యక్రమాలు లాంటి అనేక అత్యవసర సేవలను అందించుట ప్రారంభమైంది. పటిష్ట నియమనిబంధనల పునాదుల మీద ఏర్పడిన అతి పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఐక్యరాజ్యసమితి ప్రశంసలు సహితం పొందింది.
సమాజంలోని వివిధరంగాల్లో స్థిరపడిన పౌరులు తమ అమూల్య సమయాన్ని, సంపదను మరియు ఆలోచనాశక్తులను వెచ్చించి,లయన్స్ క్లబ్బులుగా ఏర్పడి సేవలను అందించడం అనుసరణీయం మరియు ప్రశంసనీయమని చెప్ప వచ్చు. సమాజ హితం కోరకుండా మనిషి మహానుభావుడు కాలేడని గట్టిగా నమ్మే మెల్విన్ జోన్స్(Melvin Jones )దూరదృష్టి అభినందనీయం. 1945లో ఐరాస ఆహ్వానం మేరకు అంతర్జాతీయ లయన్స్ క్లబ్స్ ప్రతినిధిగా హాజరై లయన్స్ లక్ష్యాలను వివరించారు. జీవితాంతం నిస్వార్థ సేవలనే శ్వాసించిన మెల్విన్ జోన్స్ తన 82వ ఏట 01 జూన్ 1961న అమరత్వం పొందారు.
మెల్విన్ జోన్స్ అనబడే ఒక్క వ్యక్తితో ప్రారంభమైన సేవా సంస్థ 1.4 మిలియన్ల సేవకులతో ప్రపంచవ్యాప్తంగా నిత్యం సామాజిక సేవలను చేయడం హర్షదాయకం. మెల్విన్ జోన్స్ స్పూర్తితో ‘నా కోసం కాదు, మీ కోసం’ అంటూ మనందరం కొంత స్వార్థాన్ని వీడనాడి నిరుపేద అవసరార్థులకు అత్యవసర సేవలు అందించడానికి కృషి చేద్దాం. నిస్వార్థ సేవకులమని లయన్స్‌ను ఆదర్శంగా తీసుకొని నినదిద్దాం.
No comment allowed please