హైద‌రాబాద్ న‌గ‌రానికి ధీటుగా వ‌రంగ‌ల్ అభివృద్ది

వరంగల్ నగర సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక కార్యచరణ‌

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రానికి ధీటుగా వ‌రంగ‌ల్ ను అభివృద్ది చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. జూన్ నాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంగా తుది దశ పనుల్లోవేగవంతం చేస్తున్నామ‌న్నారు. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో 5,257 కోట్ల రూపాయిల‌తో చేప‌ట్టే భూ గ‌ర్భ డ్రైనేజీ ప‌నులకు త్వరలో టెండ‌ర్లు పిలుస్తామ‌ని చెప్పారు. డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధిపై దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాస‌న‌స భ్యులు క‌డియం శ్రీ‌హరి, రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, కే.ఆర్ నాగ‌రాజు, నాయిని రాజేంద‌ర్ , శాస‌న మండ‌లి స‌భ్యులు బ‌స్వ‌రాజు సార‌య్య‌ , వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణి , వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్లు, జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణయాల అమలులో వేగాన్ని పెంచాలని ఆదేశించారు. జూన్ 2 నాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన ప్రగతి పనులు పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు. వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మాణ ప‌నులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో జూన్ నాటికి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. ఆసుప‌త్రి తుదిదశ నిర్మాణ ప‌నులు, సామ‌గ్రి ఏర్పాటు, డాక్ట‌ర్ల నుండి ఇతర సిబ్బంది నియామ‌కానికి స‌త్వ‌ర‌మే కార్యాచ‌ర‌ణ‌ను పూర్తి చేయాల‌ని అన్నారు.

వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో 5,257 కోట్ల రూపాయిల‌తో చేప‌ట్టే భూ గ‌ర్భ డ్రైనేజీ ప‌నులకు సంబంధించి వెంట‌నే టెండ‌ర్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి వ‌చ్చేనెల‌లో ప‌నుల‌ను ప్రారంభించేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాలని అన్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు, ఆలయ మాడవీధుల్లో కృష్ణ‌శిల‌తో చేపట్టే నిర్మాణ పనులతో పాటు భద్రకాళి చెరువు డీసిల్టేషన్, హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్ ఫాల్, అవుట్ ఫాల్ విషయంలో భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు . ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, అవుట‌ర్ రింగ్ రోడ్డు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్ భూసేక‌ర‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని సమావేశంలో నిర్ణయించారు. అసంపూర్తిగా ఉన్న 2 బిహెచ్‌కే ఇండ్ల‌కు ఈనెల 31 లోగా ల‌బ్దిదారుల‌ ఎంపిక, 2బిహెచ్‌కే కాల‌నీల్లో క‌నీస వ‌స‌తుల ఏర్పాటుకు అవ‌స‌రమైన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు పంపిస్తే నిధులు మంజూరు చేస్తామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!