Munugodu By Poll : పోలింగ్ ముగిసింది ఫలితమే మిగిలింది
ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్
Munugodu By Poll : నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఈ నియోజకవర్గంతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాలలో ఏడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి(Munugodu By Poll). చెదురు మదురు సంఘటనలు , ఈవీఎంల మొరాయింపు తప్ప పోలింగ్ పూర్తయింది.
3 వేల మంది పోలీసులు, 20 కేంద్ర బలగాలు మోహరించాయి. 119 కేంద్రాలలో 298 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది ఈసీ. ఇందులో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మొదట్లో పోలింగ్ మంద కొడిగా సాగింది. ఆ తర్వాత పుంజుకుంది. పలు చోట్ల స్థానికేతరులు కనిపించడం కొంచెం ఉద్రిక్తతకు దారి తీసింది.
ఇక పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ అన్నీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడని స్పష్టం చేశాయి. వాస్తవానికి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందినది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు.
బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనిని అధికార పార్టీ సీరియస్ గా తీసుకుంది. మొత్తం కేబినెట్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలను మోహరించింది. ఇక బీజేపీ సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు పోరాడింది. ఇక కాంగ్రెస్ పార్టీ తన పాత ఓటు బ్యాంకు పోకుండా కష్ట పడింది.
ఇక్కడ సీనియర్లు ఎవరూ సహకరించక పోవడం విశేషం. వారంతా రాహుల్ పాదయాత్రలో మునిగి పోయారు. మొత్తంగా ఎవరు గెలుస్తారనేది ఈనెల 8న తేలనుంది. అప్పటి దాకా అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్లలో భద్రంగా ఉంది.
Also Read : ప్రజాస్వామ్యాన్ని న్యాయవ్యవస్థ కాపాడాలి – కేసీఆర్
