Myanmar Army in Mizoram: భారత్ లో మయన్మార్‌ సైనికుల అక్రమ చొరబాటు ! కేంద్రాన్ని ఆశ్రయించిన మిజోరం

భారత్ లో మయన్మార్‌ సైనికుల అక్రమ చొరబాటు ! కేంద్రాన్ని ఆశ్రయించిన మిజోరం

Myanmar Army in Mizoram: భారత్‌ పొరుగు దేశమైన మయన్మార్‌ లో మిలిటరీ పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య భీకర పోరు జరుగుతోంది. మయన్మార్‌ లో పాలన కొనసాగిస్తోన్న మిలిటరీకి, ఆ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బృందాలుగా ఏర్పడిన కూటములకు మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. దీనితో మయన్మార్ లో గత కొంతకాలంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. సాయుధ దళాల గ్రూపులు… ఆర్మీ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో… మయన్మార్ సైనికులు… ఈశాన్య భారతదేశంలోని మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లోకి అక్రమంగా చొరబడి ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌ ఆర్మీకి చెందిన వందలాది మంది సిబ్బంది మిజోరం సరిహద్దుల ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 600 మంది మయన్మార్ సైనికులు… మిజోరంలో అక్రమంగా చొరబడినట్లు సమాచారం. దీనితో వారిని తిరిగి వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని మిజోరం ప్రభుత్వం… కేంద్రాన్ని ఆశ్రయించింది.

Myanmar Army in Mizoram Viral

మయన్మార్ సైనికుల అక్రమ చొరబాటు పరిణామాలపై మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి లాల్‌ దుహోమా… కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించారు. ‘ఆశ్రయం పొందేందుకు మయన్మార్ నుంచి ప్రజలు మనదేశంలోకి ప్రవేశిస్తున్నారు. మానవతా దృక్పథంతో మేం వారికి సాయం చేస్తున్నాం. ఆ దేశం నుంచి సైనికులు కూడా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 400 మందిని వెనక్కి పంపించేశాం’ అని అమిత్ షా తో సమావేశం అనంతరం సీఎం లాల్‌ దుహోమా మీడియాకు వెల్లడించారు. మయన్మార్‌ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మిజోరం కేంద్రాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తోంది.

మయన్మార్‌(Myanmar) లో 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి సైనిక పాలకులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు రెబల్ సైన్యంగా ఏర్పడి పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో మయన్మార్ ఆర్మీ- రెబల్ ఆర్మీ వర్గాల మధ్య ఘర్షణలతో దేశంలో అంతర్యుద్ధం నెలకొంది. ఈ దాడుల్లో ‘త్రీబ్రదర్‌హుడ్‌ అలయన్స్‌ (టీబీఏ)’ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో మయన్మార్‌ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్‌డీఏఏ), టాంగ్‌ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్‌ ఆర్మీ(ఏఏ) భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తిమంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి.

Also Read : AP CM Jagan Inaugurates : 205 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

Leave A Reply

Your Email Id will not be published!