Sharad Pawar : అరెస్టుల పర్వం పవార్ ఆగ్రహం
ప్రధానమంత్రి మోదీని త్వరలో కలుస్తా
Sharad Pawar : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కావాలని ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఏజెన్సీల దూకుడుపై తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడతానని అన్నారు.
తన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ పై నిన్న విడుదల అయ్యారు. ఆయన బయటకు వచ్చిన ఒక రోజు తర్వాత నోరు విప్పారు శరద్ పవార్(Sharad Pawar).
కేవలం ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేయడం దారుణమన్నారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. మహారాష్ట్ర లోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి చెందిన ప్రధాన నాయకులను ఎలా టార్గెట్ చేస్తున్నారనేది ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు శరద్ పవార్.
ఎన్సీపీకి చెందిన తమ నాయకుడు దేశ్ ముఖ్ ను , శివసేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఎంపీ సంజయ్ రౌత్ ను ఎలా టార్గెట్ చేశారో ప్రజలు గమనించారని అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు గాను తాను త్వరలో ప్రధాని మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను కలుస్తానని స్పష్టం చేశారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar).
అనిల్ దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రవేశ పెట్టలేక పోయాయంటూ పేర్కొన్నారు ఎన్సీపీ చీఫ్.
Also Read : తల్లి ఆరోగ్యం పదిలం మోదీ సంతోషం