Niranjan Reddy : వాళ్లిద్ద‌రు తెలంగాణ ద్రోహులు

సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి ఫైర్

Niranjan Reddy : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాసులు రెడ్డి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పై నిప్పులు చెరిగారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి. సోమ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆ ఇద్ద‌రిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తెలంగాణ ఉద్య‌మంలో వారి పాత్ర ఏమీ లేద‌న్నారు. జూప‌ల్లి కేవ‌లం జ‌గ‌న్ రెడ్డి కోసం రాజీనామా చేశార‌ని పేర్కొన్నారు. పొంగులేటి ఏనాడూ తెలంగాణ‌కు ఏమీ చేయ‌లేద‌న్నారు. చాలా కాలంగా ఓపిక‌తో చూస్తూ వ‌చ్చామ‌ని అన్నారు నిరంజ‌న్ రెడ్డి(Niranjan Reddy).

పొంగులేటి, జూప‌ల్లి ఇద్ద‌రు నేత‌లు డ్రామాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఏర్పాటు చేశావా అని ప్ర‌శ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌మ అధినేత కేసీఆర్ ను వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు.

వివేకంతో మాట్లాడాల‌ని, ఇష్టానుసారం విమ‌ర్శ‌లు చేస్తామంటే ఊరుకోబోమంటూ హెచ్చ‌రించారు నిరంజ‌న్ రెడ్డి(Niranjan Reddy). ఆ ఇద్ద‌రు నేత‌లు తెలంగాణ ద్రోహుల‌ని అన్నారు. తామే అధికుల‌మ‌ని అనుకుంటున్న త‌రుణంలోనే పార్టీ చీఫ్ తొల‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు. పార్టీకి డ్యామేజ్ చేయాల‌ని చూస్తే ఎవ‌రూ ఊరుకోమ‌న్నారు. ఒక‌రిద్ద‌రి కోసం పార్టీ లేద‌న్నారు.

Also Read : భ‌య‌ప‌డే స‌స్పెండ్ చేశారు – జూప‌ల్లి

Leave A Reply

Your Email Id will not be published!