ముంబై : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. ఇంత కాలం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ముంబైలో మాజీ సీఎం మీడియాతో మాట్లాడారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది. దీనిపై స్పందించారు. ఇప్పుడు ఎన్నికల తేదీలు ప్రకటించబడ్డాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. నాకు కూడా నమ్మకం ఉందని అన్నారు అఖిలేష్ యాదవ్. ఇతర ప్రాంతాల్లో కూడా బీజేపీ ఓటమి పాలవుతుందని జోష్యం చెప్పారు.
అసోం ,కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని ఎన్నికల సంఘం నిశితంగా పర్యవేక్షిస్తుందని, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఓటర్లందరికీ సురక్షితమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లభించాలని, దీనికి పూర్తిగా ఈసీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి. ఇదే సమయంలో సల్మాన్ ఖాన్‌తో భేటీ గురించి కూడా ప్రస్తావించారు. సల్మాన్ ఖాన్‌ను కలవడానికి నేను ఆయన ఇంటికి వెళ్లాను. ఆయన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో నేను ఆయన్ను కలవలేక పోయానని అన్నారు. అయితే, నేను ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాను. త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
