Manish Sisodia : కేవలం గెలుపు కాదు అతి పెద్ద బాధ్యత
ఎంసీడీ ఫలితాలపై డిప్యూటీ సీఎం
Manish Sisodia : ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో 15 ఏళ్ల భారతీయ జనతా పార్టీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. మొత్తం 250 స్థానాలకు గాను ఆప్ 134 స్థానాలలో విజయ ఢంకా మోగించింది.
బీజేపీ 104 సీట్లకే పరిమితం కాగా కాంగ్రెస్ పార్టీ 9 సీట్లకే సరిపెట్టుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ మేయర్ పీఠం ఆప్ కైవసం చేసుకోవడంతో ఆప్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం అవుతోంది.
ఇది తమ పనితీరుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) ఫలితాలపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం గెలుపు మాత్రమే కాదని అతి పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు.
ఓ వైపు కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం , ఆ పార్టీకి చెందిన శ్రేణులు, యంత్రాంగం అంతా కుమ్మక్కైనా చివరకు తమ విజయాన్ని అడ్డుకోలేక పోయారని అన్నారు. విద్వేష రాజకీయాలు కొంత కాలం వరకు మాత్రమే పని చేస్తాయని అవి ఎల్లకాలం నిలవలేవని స్పష్టం చేశారు మనీష్ సిసోడియా.
ఇదే సమయంలో పంజాబ్ ప్రభుత్వ సలహాదారు, ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ ఇది ఆప్ గెలుపు కానే కాదని ఢిల్లీ ప్రజల విజయం అని పేర్కొన్నారు. ప్రజలు తమ పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని ఆ తర్వాత ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రాధాన్యతగా ఉంటుందన్నారు రాఘవ్ చద్దా.
Also Read : ఢిల్లీ ఫలితాలు గుజరాత్ లో రిపీట్ – మాన్