Operation Cambodia: కాంబోడియా ముఠా కబంధ హస్తాల్లో చిక్కుకున్న విశాఖ యువతకు విముక్తి !
కాంబోడియా ముఠా కబంధ హస్తాల్లో చిక్కుకున్న విశాఖ యువతకు విముక్తి !
Operation Cambodia: డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో కాంబోడియా(Cambodia) ముఠా కబంధ హస్తాల్లో చిక్కుకున్న విశాఖ యువతకు పోలీసులు విముక్తి కల్పించారు. చైనా ఏజెంట్ల ద్వారా డేటా ఎంట్రీ ఉద్యోగాల కోసం కాంబోడియా వెళ్లి… అక్కడి ముఠా వలలో చిక్కుకుని సుమారు 150 మంది చిత్ర హింసలు అనుభవిస్తున్నారు. వారికి సైబర్ క్రైమ్ ఏవిధంగా చేయాలో శిక్షణ ఇచ్చి… తరువాత భారతీయులను టార్గెట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఒకవేళ బాధితులు నిరాకరిస్తే… వారిని ఆహారం పెట్టకుండా శారీరకంగా హింసించేవారు. ఈ నేపథ్యంలో కాంబోడియా ముఠా కళ్ళుగప్పి తప్పించుకున్న ఓ యువకుడు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన విశాఖ పోలీసులు… కాంబోడియా ముఠా గుట్టు రట్టు చేసారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 28 మంది బాధితులను ఇండియన్ ఎంబసీ సమన్వయంతో కాంబోడియా నుండి తీసుకువచ్చారు. వారికి విశాఖ సీపీ రవిశంకర్ అయ్యర్… విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
Operation Cambodia Updates
ఈ సందర్భంగా విశాఖ సీపీ రవిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ… ‘‘స్థానికంగా ఉన్న కొందరు ఏజెంట్లు… డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారు. మన రాష్ట్రంలోని దాదాపు 150 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1.50 లక్షలు తీసుకుని కాంబోడియా(Cambodia) ఏజెంట్లకు అప్పగించారు. మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు… సైబర్ క్రైమ్ ఏవిధంగా చేయాలో శిక్షణ ఇచ్చారు. ఆ తరువాత వివిధ రకాల స్కామ్స్ చేయించి విశాఖ నుంచే దాదాపు రూ.120 కోట్లు కొల్లగొట్టారు. గత ఆరు నెలలుగా వారంతా కాంబోడియాలో చిత్రహింసలకు గురవుతున్నారు. భారతీయులను మోసం చేస్తేనే ఆహారం అందించేవారు. బాధితులంతా అక్కడి చైనా అధికారుల ముందు నిరసన వ్యక్తం చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ విషయం ఇండియన్ ఎంబసీ దృష్టికి వెళ్లడం, విశాఖ సిటీ పోలీస్ విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి వారికి విముక్తి కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 10 మంది వచ్చారు. తరువాత ఫ్లైట్‌లో 18 మంది వస్తున్నారు.
Also Read : Naveen Patnaik : తన ఆరోగ్యంపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటున్న ఒడిస్సా సీఎం