P Chidambaram : దేశంలో తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాలలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గాంధీ ఫ్యామిలీని బాధ్యుల్ని చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం.
వారు చేయాల్సిందంతా చేశారు. కష్టపడ్డారు. అన్ని రాష్ట్రాలలో పర్యటించారు. దీనికి వారెలా బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు, బాధ్యులంతా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు చిదంబరం(P Chidambaram ).
బ్లాక్, జిల్లా, రాష్ట్ర, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ స్థాయిలో ఉన్న వారిది కూడా ఇందులో భాగస్వామ్యం ఉందన్నారు. ఓ వర్గం గాంధీ కుటుంబానికి మద్దతు పలుకుతుండగా వారికి వ్యతిరేకంగా జీ-23 పేరుతో ఉన్న టీంకు కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ నాయకత్వం వహిస్తున్నారు.
వీరిలో ప్రధానంగా కపిల్ సిబల్, మనీశ్ తివారీ, భూపిందర్ సింగ్ హూడా , శశి థరూర్ ఉన్నారు. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆజాద్ నివాసంలో సమావేశం అయ్యారు. పార్టీ నాయకత్వం మారాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాదు భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలుపుకుని ముందుకు వెళ్లాలని లేక పోతే కాంగ్రెస్ పార్టీ కనుమరుగై పోతుందని హెచ్చరించారు.
దీనిపై నిప్పులు చెరిగారు పి. చిదంబరం(P Chidambaram ). సీడబ్ల్యూసీ సమావేశంలో గాంధీ ఫ్యామిలీ తప్పుకునేందుకు సిద్దమయ్యారని వెల్లడించారు. కానీ తాము ఒప్పుకోలేదన్నారు.
ఎంత త్వరగా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుంటే అంత మంచిదన్నారు. పార్టీని అస్థిరపరిచేందుకు ప్రయత్నం చేయవద్దంటూ ఆజాద్ అండ్ టీంను కోరారు.
Also Read : లంచం అడిగితే వాట్సప్ చేయండి