DK Shivakumar : సీఎం ఎవరనేది హైకమాండ్ తేలుస్తుంది
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్
DK Shivakumar : కర్ణాటకలో వచ్చే మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 142 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొదటి విడతలో 100 మందిని ప్రకటిస్తే రెండో విడతలో 42 మందిని ఖరారు చేసింది. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం అధికారంలో బీజేపీ సర్కార్ ఉంది. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పవర్ లోకి వస్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar). గురువారం ఆయన ఓ జాతీయ మీడియా ఛానెల్ తో మాట్లాడారు. ఒకవేళ కాంగ్రెస్ గనుక అధికారంలోకి వస్తే సీఎం రేసులో మీరు ఉన్నారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
కష్ట కాలంలో పార్టీ వెంట ఉన్న వారికి అండగా ఉంటుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. తనకు మాజీ సీఎం సిద్దరామయ్యకు మధ్య పొరపొచ్చాలు, ఆధిపత్య పోరు నడుస్తుందన్న వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారం తప్ప మరొకటి కాదన్నారు. తామిద్దరం కలిసే నడుస్తున్నామని తమకు పార్టీ హైకమాండ్ ఏది చెబితే దానిని శిరసా వహిస్తామని స్పష్టం చేశారు డీకే శివకుమార్.
ఇదే సమయంలో జేడీఎస్ తో కాంగ్రెస్ జత కడుతుందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. జేడీఎస్‌తో కాంగ్రెస్ జట్టుకట్టాల్సిన అవసరం లేదని డీకే శివకుమార్ అన్నారు.
పార్టీ బలహీనమైన స్థితిలో ఉన్న సమయంలో తాను పగ్గాలు చేపట్టానని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇప్పటి వరకు నేను నిద్ర పోయింది లేదు. రాష్ట్రమంతటా పర్యటించానని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో సక్సెస్ అయినట్లు తాను భావిస్తున్నానని అన్నారు డీకే శివకుమార్(DK Shivakumar).
Also Read : స్పీకర్ టీ మీట్ బహిష్కరణ