#Pingali : నిజాం పాలనలో తొలి హిందూ పోలీస్ కమిషనర్ పింగళి

Pingali : పింగళి వెంకట రామారెడ్డి. నేటి తరానికి చెందిన చాలా మందికి ఎక్కువగా అపరిచితమైన పేరు. భాగ్యనగరం చిత్రపటంపై చెరగని సంతకం ఆయనది. నిజాం ప్రభువుకు విశ్వాస పాత్రులై, హైదరాబాద్ నగరంపై తనదయిన ముద్ర వేసుకుని, ప్రజలకు అనేక రంగాలలో సహాయ

Pingali  : పింగళి వెంకట రామారెడ్డి. నేటి తరానికి చెందిన చాలా మందికి ఎక్కువగా అపరిచితమైన పేరు. భాగ్యనగరం చిత్రపటంపై చెరగని సంతకం ఆయనది. నిజాం ప్రభువుకు విశ్వాస పాత్రులై, హైదరాబాద్ నగరంపై తనదయిన ముద్ర వేసుకుని, ప్రజలకు అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించి ప్రజా శ్రేయస్సే ఏకైక లక్ష్యంగా, అంకిత భావంతో సేవచేసి అపారమైన ప్రేమాభి మానలను చూరగొన్న ప్రజాబంధువు ఆయన.

నిజాం రాజుల ఏడు తరాల రాజ్య పాలనలో హైదరాబాదు నగర పోలీసు కమీషనర్ (కొత్వాల్) పదవికి నియమితులైన ప్రప్రథమ హిందువుగా చరిత్రలో మిగిలి పోయారాయన. వెంకట రామారెడ్డి (ఆగష్టు 22, 1869 – జనవరి 25, 1953) నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. నిజాం ప్రభువు వద్ద తమకు గల పలుకుబడి వల్ల ఎన్నో సంస్థలను స్థాపించారు. ఎన్నింటికో సాయం అందించారు. విద్యా వ్యాప్తికి (Pingali )ఎనలేని కృషి చేశారు. హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ నెలకొల్పారు.

ఆయన1869, ఆగష్టు 22 న వనపర్తి జిల్లా కొత్త కొండ మండలం ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు కేశవరావు, జారమ్మ. ఆయన పుట్టగానే కొద్ది సమయం లోనే తల్లి మరణించగా, తొమ్మిది సంవత్సరాల పాటు రాయణి పేటలో అమ్మమ్మ కిష్టమ్మ చెంత పోషణలో పెరిగారు. చిన్నప్పుడు ఖాన్గీ (ప్రైవేటు) బడిలో భారత, భాగవతాలు చదివారు. తరువాత నాలుగు సంవత్సరాలు వనపర్తి పాఠశాలలో ఉర్దూ, ఫార్సీభాషను చదువు కున్నారు. తరువాత విలియం వాహబ్ దగ్గర కన్నడ, మరాఠీ భాషలు నేర్చుకున్నారు.

నజర్‌ మహమ్మద్‌ సహాయంతో 1886లో ముదిగ్లు ఠాణాకు అమీను (సబ్ ఇన్స్‌పెక్టర్‌) గా నియమితులైనారు. తరువాత నిజాం సొంత ఎస్టేటు వ్యవహారాలలో ప్రత్యేక అధికారిగా కొంత కాలం వ్యవహరించారు. నిజాయితీ, సమర్ధత, విధుల నిర్వహణలో చాకచక్యం కారణంగా అనతికాలంలో పదోన్నతి లభించింది. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, గుల్బర్గా, అత్రాఫ్‌ బల్దా (రంగారెడ్డి) జిల్లాలో పోలీసు అధికారిగా విధులు నిర్వహించారు. ఆ తరువాత ఆయన రాజధాని నగరం హైదరాబాద్‌లో నాయెబ్‌ కొత్వాల్‌గా నియమితులైనారు. అనంతరం కొత్వాల్‌ (సిటీ పోలీస్‌ కమిషనర్‌) అయ్యారు. వేల్సు యువరాజు హైదరాబాదు వచ్చినప్పుడు గట్టి భద్రతా ఏర్పాట్లుచేసి గుర్తింపు పొందారు.

1933 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. వెంకట రామారెడ్డి ఎన్నో సంస్థలను పోషించారు. శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం వేమనాంధ్ర భాషా నిలయం, బాల సరస్వతి గ్రంథాలయం పురోభివృద్ధికి సహాయం అందించారు. 1946లో జరిగిన 26వ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించారు. హైదరాబాదులో రెడ్డి విద్యార్థి వసతిగృహం నెలకొల్పారు. తెలంగాణలో విద్యావ్యాప్తిలోనూ, రాజకీయ చైతన్యం నింపడం లోనూ రెడ్డి హాస్టల్ కీలక పాత్ర పోషించింది. హాస్టల్‌ను ప్రారంభించేందుకు గద్వాల మహారాణి, వనపర్తి రాజా, పింగళి కోదండరాం రెడ్డి, గోపాలు పేట, దోమకొండ రాజా, జటప్రోలు రాజా తదతరుల నుంచి దాదాపు లక్ష రూపాయల వరకు చందాలు పోగు చేశారు. తొలుత నగరంలో అద్దె ఇంట్లో రెడ్డి హాస్టల్‌ను ప్రారంభించారు. తర్వాత 1918లో ప్రస్తుతం అబిడ్స్‌లో ఉన్న రెడ్డి హాస్టల్ సొంత భవనంలోకి మారింది.

మాతృభాషపట్ల జరుగుతున్న నిరాదరణను చూడలేక, 26 మే 1943 బుధవారం రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయంలో నాటి ప్రముఖ పండితులు, భాషాభిమానులు, కవులు, రచయితలు సమావేశం నిర్వహించిన ఫలితంగా తెలుగు భాషా సంస్కృతుల ప్రచారం ప్రధాన లక్ష్యంగా ఒక సంస్థను స్థాపించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సంస్థకు ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’ అని పేరు పెట్టారు. పరిషత్తు ద్వితీయ మహాసభ ఓరుగల్లులో 1944 డిసెంబర్‌ 28, 29, 30 తేదీల్లో వైభవంగా జరగగా, ఉదయ రాజు రాజేశ్వరరావు ఆహ్వాన సంఘానికి అధ్యక్షులు కాగా, కాళోజీ నారాయణరావు కార్యదర్శిగా, మహాసభను రాజాబహద్దూర్‌ వెంకట రామారెడ్డి ప్రారంభించారు. సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు.

1946 మార్చి 15, 16, 17 తేదీల్లో తృతీయ మహాసభలు జరిగాయి. లోకనంది శంకరనారాయణ రావు సభలకు అధ్యక్షత వహించారు. రాజా బహదూర్‌ వెంకట రామారెడ్డి సభలను ప్రారంభించారు. నారాయణ గూడ ఆంధ్ర బాలికోన్నత పాఠశాలకు చాలా కాలం అధ్యక్షులుగా పనిచేశారు. ఆంధ్ర విద్యాలయ కార్యవర్గానికి మరణించే వరకు అధ్యక్షులుగా ఉన్నారు. 1926లో “గోలకొండ పత్రిక” స్థాపనకు ముఖ్య కారకులయ్యారు.

ఆ కాలంలో ఆయన వలన సహాయం పొందని తెలుగు సంస్థ లేదంటే అతిశయోక్తి కాదు. హరిజనోద్ధరణకు ఏర్పడిన సంఘాలకు, అనాథ బాలల ఆశ్రమాలు, కుష్టు నివారణ సంఘం జంతు హింసా నివారణ సమితి వంటి సంస్థలతో పనిచేసి, వాటికి ఉదారంగా ధన సహాయం చేశారు. ఈ క్రమంలోనే 1933లో రెడ్డి బాలికల హాస్టల్ (నారాయణ గూడ), 1954లో రెడ్డి మహిళా కళాశాల (నారాయణగూడ) లను ప్రారంభించారు.

పింగళి(Pingali )సేవలకు గుర్తింపుగా
నిజాం రాజు జన్మదినోత్సవం సందర్భంగా 1921లో “రాజా బహద్దూర్” అనే గౌరవం ఇచ్చారు.
బ్రిటిష్ ప్రభుత్వం 1931లో ఆయనకు “ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్” గౌరవం ప్రదానం చేశారు.
వెంకట రామారెడ్డి కాంస్య విగ్రహం హైదరాబాదులో నారాయణగూడ చౌరస్తాలో ప్రతిష్ఠించారు.
వెంకట రామారెడ్డి పేరుతో హైదరాబాద్‌లో ఒక మహిళా కళాశాల స్థాపితమైంది. ఆయన
పేరు మీద ట్రస్టును ఏర్పాటుచేసి, ఆ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్‌, సైబరాబాద్‌ మూడు కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న పోలీస్‌ అధికారులు విధుల్లో ప్రతిభ కనబర్చిన వారికి రాజాబహద్దూర్‌ వెంకట రామారెడ్డి అవార్డును అందజేస్తున్నారు.

పధ్నాలుగు సంవత్సరాలు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసి, గ్రామీణ విద్యార్థుల చదువు కోసం రెడ్డి హాస్టల్‌ స్థాపించి, ఎందరో తెలుగువారు వెలుగులోకి రావడానికి కారకుడైన మహానుభావుడు కొత్వాల్‌ వెంకటరామారెడ్డి జనవరి 25 తేదీన 1953 సంవత్సరంలో పరమ పదించారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని దోమలగుడ ప్రాంతంలో ఆయన సమాధి ఉంది.

No comment allowed please