Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు
పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు
పల్నాడు జిల్లా గుండ్లపాడులో టీడీపీ నాయకుల జంట హత్యల ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసారు. సెక్షన్ 302 కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఎ-1గా జవిశెట్టి శ్రీను, ఎ-2గా తోట వెంకట్రావు, ఎ-3గా తోట గురవయ్య, ఎ-4గా నాగరాజు, ఎ-5గా తోట వెంకటేశ్వర్లు, ఎ-6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎ-7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని చేర్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్న పల్నాడులో… శనివారం సాయంత్రం ఇద్దరు టీడీపీకు చెందిన నేతలను అదే పార్టీకి చెందిన మరికొంత మంది హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హత్యల వెనుక మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల హస్తం ఉన్నట్లు స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేయగా… నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు శనివారం తెలంగాణలోని హుజూర్‌నగర్ జిల్లాలో ఒక వివాహానికి హాజరై బైక్‌పై గ్రామానికి తిరిగివెళుతున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్దకు వచ్చేటప్పటికి ఓ స్కార్పియో వాహనం వీరి బైక్‌ను వేగంగా ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఇద్దరూ చనిపోయారా లేదా అని పరిశీలించిన కారులోని నిందితులు… కొన ఊపిరితో ఉన్న కోటేశ్వరరావును రాయితో మోది చంపినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ వాహనాన్ని ఆక్కడే వదిలేసి నిందితులు నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. దీనితో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వం ఈ జంట హత్యల కేసును సీరియస్ గా తీసుకుని… నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని… సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది.