పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలి : సీఎం

రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సమీక్ష‌

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన చోట పోలీస్ సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సైబర్ క్రైమ్, మనీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలను అప్రమత్తం చేసేలా విశాఖ పోలీసులు రూపోందించిన ప్రచార వీడియోలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత అనేది లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొత్త జిల్లాలు, సున్నితమైన ప్రాంతాలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే దేవాలయాల వద్ద అవసరమైన మేరకు పోలీసు సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని పేర్కొన్నారు సీఎం. రాష్ట్రంలో నేరాల రేటు 6 శాతం మేర తగ్గిందన్నారు. శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నాయని చెప్పారు. అయితే ఇదే క్ర‌మంలో ఆర్ధిక నేరాలు, సైబర్ ఫ్రాడ్స్ కూడా పెరిగాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

వీటిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపిని ఆదేశించారు సీఎం. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. రోడ్ సేఫ్టీ చర్యలు మరింతగా చేపట్టాలన్నారు. అవసరమైన చోట ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. 503 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు సరి చేయాల‌ని సూచించారు. మహిళలపై నేరాలు తగ్గాయని, మరింతగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు. రౌడీషీటర్లను కట్టడి చేయడానికి డ్రోన్లతో నిఘా పెట్టే అంశాన్ని పరిశీలించాలని అన్నారు .గత పాలనలో గంజాయి, అక్రమ మద్యం లాంటివి విచ్చలవిడిగా ఉండేవన్నారు. వదంతులు సృష్టించటం, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం లాంటివి గతంలో ఉన్నాయన్నారు. నెల్లూరులో రౌడీ ముఠాలను గుర్తించారని, ఇలాంటి ముఠాలు మిగిలిన జిల్లాల్లో ఉన్నాయేమో నిఘా పెట్టాల‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!