Draupadi Murmu : తెలంగాణకు రానున్న రాష్ట్రపతి
శ్రీశైలం దర్శించు కోనున్న ముర్ము
Draupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అంతకు ముందు ద్రౌపది ముర్ము ఏపీ లోని ప్రముఖ దేవాలయం శ్రీశైలంలో కొలువు తీరిన మల్లికార్జున స్వామి, భ్రమరాంభికలను దర్శించుకుంటారు.
ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కర్నూలు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఎస్పీ, జేసీ అక్కడే ఉన్నారు. మేడం రాకతో భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) చెంచులు స్వాగతం పలుకుతారు. వారితో ఆమె కొద్ది సేపు ముచ్చటిస్తారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ లో కొద్ది సేపు ఉంటారు.
రెండున్నర గంటల పాటు శ్రీశైలంలో ఉంటారు ద్రౌపది ముర్ము. ఇందులో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్ పథకంలో భాగంగా శ్రీశైల ఆలయ అభివృద్దికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అక్కడే ఉన్న శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.
అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు వస్తారు. బొల్లారం వార్ మెమోరియల్ లో అమర జవాన్లకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారరు. రాత్రికి రాజ్ భవన్ లో ఇచ్చే విందులో పాల్గొంటారు.
ద్రౌపది ముర్ము ఈనెల 30వ తేదీ వరకు హైదరాబాద్ లోనే ఉంటారు. అయిదు రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. గవర్నర్ తో పాటు సీఎం , మంత్రులు స్వాగతం పలుకుతారు.
Also Read : రాహుల్ గాంధీతో మాట్లాడితే ‘ఐబీ’ టార్గెట్