Rahul Gandhi : అగ్నిపథ్ స్కీమ్‌పై రాహుల్ ఫైర్
భారత దేశ దళాల తీవ్రతను తగ్గిస్తుందని ఆగ్రహం
Rahul Gandhi : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకు వస్తున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీమ్ పై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. దేశం రెండు రంగాలలో బెదిరింపులు ఎదుర్కొంటున్న వేళ దీనిని తెలివిగా తెరపైకి తీసుకు వచ్చారంటూ ఆరోపించారు.
బుధవారం ట్విట్టర్ వేదికగా ఈ స్కీమ్ పై ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాయుధ బలగాల్లోకి స్వల్ప కాలికంగా యువతీ, యువకులను భర్తీ చేసుకోవాలనే ఈ కొత్త స్కీమ్ ఉద్దేశం.
దీనిని అమలు చేయడం వల్ల దేశంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న సైనిక దళాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వీరిని నియమించడం వల్ల ప్రత్యేకించి సాయుధ దళాలకు చెందిన గౌరవం, సంప్రదాయాలు, శౌర్యం, క్రమశిక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
ఇప్పటికే దేశంలో మతం పేరుతో అరాచకం రాజ్యం ఏలుతోందంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . ఈ పథకం యువకులను మోసం చేసే ఎత్తుగడగా అభివర్ణించారు.
బీహార్ తో పాటు దేశంలో యువత తీవ్ర నిరాశలో ఉంది. ఇప్పటి వరకు 60 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 10 లక్షలు నింపుతామంటూ మోదీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
అగ్ర నాయకుడు ట్వీట్ చేసే కంటే ముందు రాష్ట్ర స్థాయి నాయకులు ఈ స్కీమ్ గురించి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఔత్సాహికులు, రక్షణ విశ్లేషకుల నుండి గణనీయమైన విమర్శలు కూడా వచ్చాయి.
మంగళవారం ప్రకటించిన ఈ పథకం వల్ల దీర్ఘకాలిక అవకాశాలను గండి కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : కేంద్రం తీరుపై కాంగ్రెస్ కన్నెర్ర