Rahul Gandhi : దారి తప్పిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చికిత్స మొదలు పెట్టింది ఏఐసీసీ. రాష్ట్రానికి చెందిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు రాహుల్ గాంధీతో(Rahul Gandhi) భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలకు సిద్దం కావాలని, టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందన్న ప్రచారాన్ని నమ్మవద్దంటూ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లాలన్నారు.
ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను ఎదుర్కోవాలని ఉద్బోదించారు. సీనియర్లు విభేదాలు వీడి ఏకతాటిపైకి రావాలని పేర్కొన్నారు.
తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తానన్నారు. ఏమైనా చెప్పాలని అనుకుంటే హై కమాండ్ తో మాట్లాడాలని, మీడియా ముందుకు రావద్దంటూ సూచించారు.
మూడు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. పాల్గొన్న వారంతా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. వారందరి అభిప్రాయాలను సావధానంగా విన్నారు రాహుల్ గాంధీ.
అంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల కిందటే అభ్యర్థులను ప్రకటించాలన్న కోమటిరెడ్డి సూచనను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.
తాను సైతం తెలంగాణపై పూర్తి స్థాయి ఫోకస్ పెడతానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). రాహుల్ గాంధీతో భేటీ అయిన వారిలో 40 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలు, క్షేత్ర స్థాయిలో పార్టీ స్థితిగతులు, అంతర్గత విభేదాలు, సంస్థాగత వ్యవహారాలు, పలు ఇతర అంశాలను ప్రత్యేకంగా రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు.
వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని, పార్టీని పవర్ లోకి తీసుకు రావాలని ఆదేశించారు రాహుల్ గాంధీ.
Also Read : రాణా అయ్యూబ్ ను వెళ్లనీయండి