Shatrughan Sinha : రాహుల్ యాత్ర సూప‌ర్ – శ‌త్రుఘ్న సిన్హా

రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీకి బూస్ట్

Shatrughan Sinha : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్ర‌ముఖ న‌టుడు శ‌త్రుఘ్న సిన్హా(Shatrughan Sinha) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర అద్భుతం అంటూ కితాబు ఇచ్చారు. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి ప్రారంభ‌మైన ఈ యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు వేయి కిలోమీట‌ర్ల‌ను పూర్తి చేసుకుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళనాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో ముగిసింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కొన‌సాగుతోంది. ఈ యాత్ర‌కు చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా ఆద‌రిస్తున్నారు. రాహుల్ గాంధీని అక్కున చేర్చుకుంటున్నారు. జ‌నం జేజేలు ప‌లుకుతుండ‌డంతో పార్టీకి పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు.

ఈ త‌రుణంలో బాలీవుడ్ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు సిన్హా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 3,570 కిలోమీట‌ర్ల సుదీర్ఘ యాత్ర 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌న సంఖ్య‌ను మ‌రింత పెంచుకునేందుకు దోహ‌దం చేస్తుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌రైన నాయ‌కుడిని ప్ర‌జ‌లు ఎన్నుకుంటార‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు. భార‌త్ జోడో యాత్ర త‌ర్వాత రాహుల్ గాంధీ త‌న నాయ‌క‌త్వ సామ‌ర్థ్యాన్ని నిరూపించు కున్నార‌ని టీఎంసీ ఎంపీ కితాబు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 2019లో 52 సీట్లు మాత్ర‌మే గెలుచుకున్న పార్టీని తిరిగి పున‌ర్ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చేందుకు దోహ‌ద ప‌డుతుంద‌న్నారు.

రాహుల్ గాంధీ చ‌రిష్మా ప‌ని చేయ‌డం ప్రారంభించింద‌ని ప్ర‌శంసించారు సిన్హా. ఆయ‌న‌ను ప‌ప్పు అని ఎగ‌తాళి చేసిన వారంతా ఇవాళ తాము చేసిన కామెంట్స్ త‌ప్ప‌ని తెలుసుకుంటార‌ని అన్నారు.

Also Read : ప‌టేల్ అఖండ భారతాన్ని సాధిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!