Rajinikanth : దేశం మొత్తం వేరు తమిళనాడు వేరు. ఆ రాష్ట్ర ప్రజలకు కోపం వచ్చినా తట్టుకోలేరు. సంతోషం వచ్చినా ఆపుకోలేరు. వారి నైజమే అంత. వారికున్న భాషాభిమానం ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేదనే చెప్పవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లినా తమిళమే కనిపిస్తుంది..వినిపిస్తుంది. వాళ్లతో పాటు ఉన్న వాళ్లు ఎవరైనా సరే తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. అంతెందుకు వాళ్లకు గుళ్లు కూడా కట్టిస్తారు. అభిమానం అంటే ఏమిటో..వాటిని ప్రదర్శించడం అంటే ఏమిటో తెలుసు కోవాలంటే అక్కడి సినిమా రంగాన్ని..రాజకీయ రంగాన్ని చూడాల్సిందే. ఇక్కడ ప్రతిదీ ఓ సంచలనమే. మతం ప్రాతిపదికగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఎన్నో ఏళ్లుగా తమిళనాడులో పాగా వేయాలని కంకణం కట్టుకున్నది. అయినా ఈరోజు వరకు అక్కడ తన ప్లాన్ ను అమలు చేయలేక పోతోంది.
తమిళనాడు రాజకీయాలు విలక్షణమైనవి. దేశ రాజకీయాలకు భిన్నమైనవి కూడా. ఆత్మాభిమానం..ఆత్మ గౌరవానికే అక్కడ పెద్ద పీట వేస్తారు. ఇందు కోసం తాము ఏమై పోయినా సరే పర్వాలేదనే మనస్తత్వం వారిది. ఇక్కడ పాగా వేయాలని..పవర్ లోకి రావాలని ఎన్నో ఏళ్లుగా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ అక్కడి ప్రజలు రెండు పార్టీలకే పట్టం కడుతూ వచ్చారు. ఇక్కడి రాజకీయాలకు సినిమాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ రెండింటిని వేరు చేసి చూడలేం. ప్రతి చోటా ప్రతి నాయకుడికి..నటీనటులకు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. అలాగే పొలిటికల్ లీడర్లకు కూడా. ఏ మాత్రం తేడా వచ్చినా రాష్ట్రం అగ్ని గుండం అవుతుంది. అక్కడ హోం శాఖ అప్రమత్తంగా ఉంటుంది.
ఓ వైపు మెరీనా బీచ్..ఇంకో వైపు పాండీ బజార్ చుట్టూ రాజకీయం అల్లుకుని ఉంటుంది.
నిన్నటి దాకా తమిళనాట ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, జయలలిత చుట్టూ తిరిగింది. ప్రస్తుతం ఆనాటి తరం నేటి రాజకీయాలకు ఆనవాళ్లుగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా జయలలితపై ఎన్ని ఆరోపణలు వచ్చినా..కేసులు నమోదైనా అభిమానులు మాత్రం ఆమెను దైవ స్వరూపంగా భావించారు. కొన్ని చోట్ల గుడి కట్టారు కూడా. అమ్మ క్యాంటీన్లు అక్కడ ఫేమస్. తక్కువ ధరకే టిఫిన్లు, భోజనం ఏర్పాటు చేశారు ఆమె. ఆ మధ్య ఆమెపై విష ప్రయోగం జరిగిందని, దాని వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందంటూ విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
భౌతికంగా ఆమె లేదు. ఆమె వెనుక ఉండి నడిపించి..రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన నాయకురాలిగా శశికళకు పేరుంది. ఆమె అనూహ్యంగా జైలు పాలైంది. త్వరలో విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు కూడా జరిగే వీలుంది. పన్నీర్ సెల్వంకు కేంద్రం నుండి ఆశీస్సులు ఉన్నాయి. ఇదే క్రమంలో తమిళనాడులో ఒక్కసారిగా పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నటులు శరత్ కుమార్, కమల హాసన్ తో పాటు తలైవా రజనీకాంత్ సైతం పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. దంతో పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. దేశమంతటా చర్చోప చర్చలు జరిగాయి. ఉన్నట్టుండి షూటింగ్ సమయంలో రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. పార్టీ పేరు ప్రకటించారు. రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎన్నికల బరిలో ఉంటానని వెల్లడించారు.
దీంతో కోట్లాది మంది అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పాలాభిషేకం చేశారు. తీరా ఎన్నికలకంటే ఆరోగ్యం ముఖ్యమని ఇపుడున్న పరిస్థితుల్లో తాను పార్టీ పెట్టలేనంటూ క్షమించమంటూ ప్రకటించారు. తీరా తలైవా తన మాటల్ని వెనక్కి తీసుకోవడంతో అభిమానుల్లో నైరాశ్యం కమ్ముకుంది. కొందరు బాధపడ్డారు. ఎందుకిలా చేశావంటూ తలైవాను వేడుకున్నారు. కానీ తలపతి తగ్గలేదు. హెల్త్ బాగుంటేనే పాలిటిక్స్ అంటూ స్పష్టం చేశారు. అమిత్ షా, స్టాలిన్, కమల్, రజనీ, విజయ్, శరత్, శశికళలలో ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో ఏం జరుగుతుందనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
No comment allowed please