Rakesh Tikait : కేంద్రంపై మరో యుద్దానికి సిద్దం – టికాయత్
కిసాన్ మోర్చా అగ్ర నేత హెచ్చరిక
Rakesh Tikait : కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ రోజుకో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుతోందంటూ నిప్పులు చెరిగారు కిసాన్ మోర్చా జాతీయ నేత రాకేశ్ టికాయత్(Rakesh Tikait). ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా కళ్యాణ్ పూర్ లో నిర్వహించిన కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
తాము కోరిన ఏ ఒక్క అంశాన్ని ఇప్పటి వరకు అమలు చేసిన పాపాన పోలేదన్నారు టికాయత్. మాయ మాటలు చెప్పడంలో, ఓట్లు కొల్లగొట్టడంలో ఉన్నంత శ్రద్ద ఈ కేంద్ర సర్కార్ కు రైతుల పట్ల, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పట్టింపు లేదని ధ్వజమెత్తారు.
కనీస మద్దతు ధర కావాలని, రైతులకు భీమా వర్తింప చేయాలని, ధాన్యం పాడవకుండా గోదాములు నిర్మించాలని, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రధానంగా రైతులను పొట్టన పెట్టుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలన్నారు రాకేశ్ టికాయత్. కోర్టు సీరియస్ గా స్పందించినా, సిట్టింగ్ జడ్జి విచారణలో నిజం బయట పడినా ఎందుకని ఇంకా మంత్రి వర్గంలో కొనసాగిస్తున్నారంటూ ప్రశ్నించారు.
కేంద్రం స్పందించక పోతే మరోసారి రైతుల ఆధ్వర్యంలో మహా యుద్దానికి శ్రీకారం చుడతామని రాకేశ్ టికాయత్(Rakesh Tikait) హెచ్చరించారు. అన్నదాతలను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం దేశంలో నిలబడిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.
ఇకనైనా ప్రధాన మంత్రి మోదీ రైతుల సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు రైతు అగ్ర నాయకుడు.
Also Read : పాలిటిక్స్ కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం