డబుల్ ఇంజన్ సర్కార్ పని ఖతమైంది. కులం, మతం , విద్వేష పూరిత రాజకీయాలు ఇక్కడ పని చేయవని కన్నడ వాసులు స్పష్టం చేశారని మాజీ సీఎం , కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య. సొంత బలం తోనే తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరుకునే దిశగా పరుగులు తీస్తోంది. ఒక రకంగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆ పార్టీకి ఈ ఫలితాలు ఆక్సిజన్ ఇచ్చింది.
శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి విచ్చేశారు మాజీ సీఎం సిద్దరామయ్య. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ పనై పోయిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృతంగా పర్యటించినా వర్కవుట్ కాలేదన్నారు.
తాము ఏ పార్టీపై ఆధార పడాల్సిన అవసరం లేదన్నారు సిద్దరామయ్య. ప్రజలు ఇచ్చిన తీర్పు అద్భుతమన్నారు. వాళ్లు కులం, మతం, విద్వేష రాజకీయాలను పట్టించు కోలేదని ఈ ఫలితాలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. 120కి పైగా సీట్లు గెల్చు కోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇకనైనా బీజేపీ పునరాలోచించు కోవాలని, డబ్బులతో ప్రజలను కొనాలని అనుకోవడం తప్పని తేలిందన్నారు.
