Revanth Reddy : బీజేపీ కుట్రలో భాగమే బీఆర్ఎస్ – రేవంత్
సీఎం కేసీఆర్ మాటలు బక్వాస్
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ప్రజలను నమ్మించడంలో ఆయన ఆరితేరాడని ఎద్దేవా చేశారు. శుక్రవారం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. అబద్దాలను నిజాలుగా నమ్మించడంలో కేసీఆర్ దేశంలో నెంబర్ వన్ గా ఉంటాడని అన్నారు.
ఏరికోరి గెలిపిస్తే సొల్లు కబుర్లు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ ఆడుతున్న నాటకంలో కేసీఆర్ ఒక భాగమని ఆరోపించారు. అందులో భాగంగానే భారత రాష్ట్ర సమితి అనే కొత్త దుకాణం ముందుకు తీసుకు వచ్చాడని మండిపడ్డారు.
ఓ వైపు జనం సమస్యలతో సతమతం అవుతుంటే రాష్ట్రంలో పాలన చేతకాని సీఎం దేశాన్ని ఏం ఉద్దరిస్తానని బీఆర్ఎస్ తీసుకు వచ్చిండో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy) . కేసీఆర్ చెప్పే మాటలను ఆయన కుటుంబీకులే నమ్మడం లేదని ఇక ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
రాబోయే కాలంలో కోలుకోలేని షాక్ ఇవ్వడం ఖాయమన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటు బ్యాంకును చీల్చేందుకే ఈ కొత్త నాటకానికి కేసీఆర్ , బీజేపీ కలిసి తెర లేపాయంటూ నిప్పులు చెరిగారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఢీకొనగలిగే సత్తా టీఆర్ఎస్ కు లేదన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండూ అలయ్ బలయ్ ఆడుకుంటాయని అన్నారు. పొద్దున లేచి నప్పటి నుంచి పడుకునేంతా దాకా అన్నీ అబద్దాలు తప్ప ఒక్క నిజం లేదన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : ఇక దేశమంతటా గులాబీమయం – కేసీఆర్
