Revanth Reddy : అగ్నిపథ్ స్కీం దేశానికి ప్రమాదం – రేవంత్
కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యానికి పరాకాష్ట
Revanth Reddy : కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీం వల్ల దేశానికి ప్రమాదమని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఎలాంటి చర్చలు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు యువత పాలిట శాపంగా మారిందన్నారు.
ఈరోజు వరకు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ప్రజా ప్రతినిధులు కానీ మోదీ సర్కార్ ను నిలదీసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.
ఎవరి పర్మిషన్ తీసుకుని కాల్పులకు పాల్పడ్డారంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయొద్దని డిమాండ్ చేశారు.
ఒకవేళ కేసులు నమోదు చేసినా విరమించు కోవాలని సూచించారు. భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. చని పోయిన రాకేశ్ కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం దారుణమన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మోదీ, రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఇద్దరూ నేరస్తులేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీపీసీసీ చీఫ్(Revanth Reddy).
రాకేశ్ ను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి ని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు.
తాజాగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువకులను పరామర్శించారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Also Read : ప్రభుత్వ శాఖలు భర్తీ చేసే పోస్టులు