బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. ముందు పరీక్షా పత్రాలను లీకు చేసిన వారెవరో ముందు బయట పెట్టాలని డిమాండ్ చేశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. టెన్త్ పేపర్ లీకుకు సంబంధించి 48 గంటల్లో విచారణ పూర్తి చేశారని కానీ ఇప్పటి వరకు రోజులు గడుస్తున్నా ఎందుకని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారానికి సంబంధించి వివరాలు వెల్లడించడం లేదని ప్రశ్నించారు.
వెంటనే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని, సిట్ కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచాణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా బీఎస్పీ అఖిలపక్ష పార్టీలతో కలిసి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మార్చి 11 నుండి నేటి దాకా ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు దోషులు ఎవరు ఉన్నారనేది తేల్చలేదన్నారు.
కమిషన్ చైర్మన్ , కార్యదర్శి, సభ్యులు ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని , తిరిగి పరీక్షలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఇది పూర్తిగా కావాలని ప్రజలను, నిరుద్యోగులను తప్పు దోవ పట్టించడం తప్ప మరొకటి కాదనన్నారు ఆర్ఎస్పీ. అసలైన చైర్మన్ , సభ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
తాండూరులో జరిగితే సస్పెండ్ చేశారు. వరంగల్ హిందీ పేపర్ లీకేజీలో దోషులు, కుట్ర దారులను బయట పెట్టారు. కానీ టీఎస్పీఎస్సీ విషయంలో ఎందుకని తాత్సారం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.