RS Praveen Kumar : కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దారుణం
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇవాళ 100 మంది కాంట్రాక్టు కార్మికులు తనను కలిశారని తెలిపారు. వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 25,000 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
2012లో కాంట్రాక్టు కార్మికులను అందరినీ పర్మినెంట్ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పర్మినెంట్ చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు బీఎస్పీ చీఫ్. ఇదే సమయంలో భాగ్యనగరంలో కాంట్రాక్టు కార్మికులు అభాగ్యులుగా మారారని మండిపడ్డారు. హైదరాబాద్ నగర పాలక సంస్థని దశల వారీగా రాంకీ ప్రైవేట్ సంస్థకు అప్పగించి పారిశుధ్య కార్మికుల పొట్ట కొడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
బహుజన రాజ్యం అధికారం లోకి వస్తే కాంట్రాక్టు కార్మికులను అందరినీ పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు బీఎస్పీ చీఫ్. రాష్ట్రంలో పాలన పడకేసిందని, రాచరిక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న దొర పాలనకు మంగళం పాడేందుకు ప్రజలు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు.
Also Read : Boxer Vijender