RS Praveen Kumar : లక్ష మందితో ప్రగతి భవన్ ముట్టడిస్తాం
హెచ్చరించిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ
RS Praveen Kumar Protest : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు, కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేశారు. సోమవారం కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ వల్ల ఆయన కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదన్నారు ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar Protest). విద్యార్థులు కష్టపడితే, బలిదానం చేసుకుంటే వచ్చిందని గుర్తు చేశారు. లక్ష మందితో టీఎస్ పీఎస్సీ ఆఫీసును, ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని సంచలన ప్రకటన చేశారు.
రేపు రాష్ట్రాన్ని కాపాడుకునే సత్తా విద్యార్థులకే ఉందన్నారు ఆర్ఎస్పీ. ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించడం వల్ల ఎక్కువగా అక్రమాలు జరిగేందుకు ఆస్కారం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో పాలన గాడి తప్పిందన్నారు. 90 ఎంఎల్ రాజ్యం నడుస్తోందని ఎద్దేవా చేశారు. సింగరేణి నియామకాల్లో కూడా అక్రమాలు జరిగాయని వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ద్వారా జరిపిన అన్ని పరీక్షలను రద్దు చేయాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). నిరుద్యోగులంటే ప్రభుత్వానికి చులకన భావం ఉందన్నారు. విద్యార్థులు ఎలాంటి నిరాశకు లోను కావదన్నారు. ఆవేశ పూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ పేపర్ లీకేజీలో అసలైన దొంగలు బయట పడేంత దాకా తాము పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత సీఎం కేసీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ కు దమ్ముంటే 500 మంది కటాఫ్ మార్కులు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో పేర్లతో సహా బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read : నిరుద్యోగుల కోసం కలిసి పోరాడుదాం