Sanjay Singh : ఆప్ కౌన్సిలర్లతో బీజేపీ బేరం – సంజయ్ సింగ్
నిప్పులు చెరిగిన రాజ్య సభ ఎంపీ
Sanjay Singh : ఢిల్లీ బల్దియా ఎన్నికల్లో 15 ఏళ్ల భారతీయ జనతా పార్టీ ఆధిపత్యానికి ఆమ్ ఆద్మీ పార్టీ చెక్ పెట్టింది. తాజాగా జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో కేవలం బీజేపీని 104 సీట్లకే పరిమితం చేసింది. మొత్తం 250 సీట్లకు గాను 1,300 మంది పోటీ పడ్డారు. ఆప్ 134 సీట్లను కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ 9 సీట్లకే పరిమితమైంది.
ఈ తరుణంలో ఢిల్లీ పీఠం పూర్తిగా ఆప్ వశం కానుంది. అయితే బీజేపీ తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్(Sanjay Singh) . శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో కౌన్సిలర్ పార్టీ మారితే రూ. 50 లక్షలు ఆఫర్ ఇచ్చిందని ఈ విషయం తమకు తెలుసని నిప్పులు చెరిగారు.
ఇప్పటికే బీజేపీకి కాలం చెల్లిందని, ఒక్క గుజరాత్ లోనే గట్టెక్కిందని మిగతా చోట్ల జెండా వెలసి పోయిందని మండిపడ్డారు సంజయ్ సింగ్ . ఇలాంటి చౌకబారు నాటకాలకు తమ అభ్యర్థులు లొంగి పోరని స్పష్టం చేశారు. బీజేపీ తన డర్డీ గేమ్స్ ప్లే చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ప్రలోభాలకు గురైన కౌన్సిలర్లు కూడా మీడియా ముందుకు వచ్చారు. బీజేపీ తమకు డబ్బులు ఆఫర్ చేసిన మాట వాస్తవమని, కానీ తాము అమ్ముడు పోయే ప్రసక్తి లేదని ప్రకటించారు.
బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన వారిలో కౌన్సిలర్లు డాక్టర్ రోనాక్షి శర్మ, అరుణ్ నవారియా, జ్యోతి రాణి ఉన్నారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడితే ప్రజలు తిప్పి కొట్టే రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు సంజయ్ సింగ్(Sanjay Singh) .
Also Read : అవినీతికి అందలం పాలన అస్తవ్యస్తం – పీకే