Sanjay Raut : శరద్ పవార్ ను బెదిరించారు – సంజయ్ రౌత్
మోదీ..అమిత్ షా మీరు సమర్థిస్తారా దీనిని
Sanjay Raut : మరాఠా రాజకీయం మరింత ముదిరింది. నువ్వా నేనా అన్న రీతిలో టెన్షన్ కొనసాగుతోంది. గంట గంటకు పరిణామాలు మారుతున్నాయి. ఈ తరుణంలో శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన ఆరోపణలు చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మొత్తం సంక్షోభానికి కేంద్రమే కారణమని మండిపడ్డారు. అంతే కాదు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కేంద్ర మంత్రి ఒకరు బెదిరించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మీ కేబినెట్ లోని ఓ మంత్రి బెదిరిస్తే దానిని మీరు స్వాగతిస్తారా అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ప్రశ్నించారు సంజయ్ రౌత్(Sanjay Raut).
అతను స్వచ్చమైన మరాఠా పుత్రుడు. మీవారే కావాలని బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు బహిరంగంగా తెలుసు కోవాలని కోరుకుంటున్నారని అన్నారు.
ఇదిలా ఉండగా తిరుగుబాటు తర్వాత పార్టీ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ధిక్కార స్వరం వినిపించిన మంత్రి ఏక్ నాథ్ షిండే వైపు ఉండగా మరికొందరు సీఎం ఉద్దవ్ ఠాక్రే వైపు నిలబడ్డారు.
ఇప్పటికే గౌహతిలో క్యాంప్ లో ఉన్న షిండే తన వైపు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. అసలైన శివసేన పార్టీ తమదేనని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ కరోనా సోకి ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో రోజు రోజుకు రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read : మాదే నిజమైన శివసేన పార్టీ – షిండే