Shiv Sena Workers Weeping : ‘శివ’ సైనికుల కంటతడి
నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారు
Shiv Sena Workers Weeping : మరాఠాలో రాజకీయ సంక్షోభానికి కారకులైన మంత్రి ఏక్ నాథ్ షిండే, ఎమ్మెల్యేలపై మరాఠాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందంటూ షిండే ప్రకటించారు.
ఆయన గుజరాత్ లోని సూరత్ నుంచి బుధవారం బీజేపీ రక్షణలో అస్సాంలోని గౌహతికి చేరుకున్నారు. వీరంతా ప్రస్తుతం కాషాయ దళ రక్షణలో ఉన్నారు.
ఇదిలా ఉండగా నమ్మి ఓటు వేస్తే చివరకు శివసేన పార్టీకి తీరని ద్రోహం తలపెట్టారంటూ శివసేన పార్టీ కార్యకర్తలు మండి పడుతున్నారు.
షిండే, ఎమ్మెల్యేలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక రాష్ట్రంలో సమీకరణాలు పూర్తిగా మారి పోవడం, ప్రస్తుత మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మైనార్టీలోకి పడి పోవడం చకచకా జరిగి పోయాయి.
దీంతో పెద్ద ఎత్తున శివసేన పార్టీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు శివసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు. ఏక్ నాథ్ షిండేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తల్లి లాంటి పార్టీకి వెన్ను పోటు పొడిచి బీజేపీతో జత కట్టాడని ఆరోపించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని, మోసం చేసిన వారిని విడిచి పెట్టే ప్రసక్తి లేదంటూ హెచ్చరిస్తున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది మరాఠాలో. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. షిండే, ఎమ్మెల్యేలు ఎలా కాలు మోపుతారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
ఈ ద్రోహులను శిక్షించాలంటూ మహిళా కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు(Shiv Sena Workers Weeping) . ఓటర్లు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే ఇలాగేనా చేసేదంటూ ఫైర్ అయ్యారు. ఎప్పటికీ ప్రజలు క్షమించరన్నారు.
Also Read : సంక్షోభం వేళ సీఎం ఠాక్రేకు కరోనా