SKM : తమ డిమాండ్లు ఇంకా నెరవేరలేదని మరోసారి స్పష్టం చేసింది సంయుక్త కిసాన్ మోర్చా(SKM ). 42 రైతు సంఘాలన్నీ కలిసి ఒకే వేదికగా రైతు ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం పాటు నడిపాయి.
ప్రధాని మోదీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో పోరాటాన్ని విరమించారు. రైతులు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లి పోయారు. ఈ సందర్భంగా ఎస్కేఎం ఆరు ప్రధాన డిమాండ్లతో కూడిన లేఖను ప్రధాని మోదీకి పంపించారు.
వాటన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ రోజు వరకు తమ డిమాండ్ల గురించి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఊసెత్తడం లేదంటున్నారు రైతు నాయకులు.
ఈ మేరకు ఈనెల 15న మరోసారి కీలక సమావేశం కానున్నామని సంయుక్త కిసాన్ మోర్చా (SKM )నాయకులు వెల్లడించారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఎస్కేఎం ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి వర్గం నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలని, ఉద్యమ సమయంలో రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తి వేయాలని, అక్రమంగా జైళ్లలో ఉంచిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతు నాయకులు.
అంతే కాకుండా ప్రాణాలు కోల్పోయిన 702 మంది రైతులకు పరిహారం ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలన్నది వీరి ప్రధాన డిమాండ్.
కాగా త్వరలోనే గోవా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ , మణిపూర్ , ఉత్తరాఖండ్ లలో ఎన్నికలు జరగనున్నాయి. తమ సత్తా ఏమిటో చూపిస్తామంటున్నారు. ఇందులో భాగంగానే 15న కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రైతు సంఘం నాయకులు.
Also Read : వ్యవసాయ ఉత్పత్తులపై సెబీ నిర్ణయం