Smriti Irani : రాహుల్ ను వాయనాడు నుంచి పంపిస్తా
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కామెంట్స్
Smriti Irani : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీగా అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. తాను అమేథీ నుంచి తరిమి వేశానని, ఇక వాయనాడు నుంచి కూడా వెళ్లగొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు స్మృతీ ఇరానీ. కేరళ లోని తిరువనంతపురంలో ఆమె మాట్లాడారు. రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అమేథీలో ఎంపీగా ఉన్నంత కాలం నిద్ర పోయారని, ప్రజల సమస్యలను పట్టించు కోలేదని ఆరోపించారు.
దీంతో ప్రజలు దిమ్మ తిరిగేలా తీర్పు చెప్పారంటూ పేర్కొన్నారు. ఒక స్థాయి కలిగిన నాయకుడు ఇలాగేనా మాట్లాడేది అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీని యూపీ నుంచి వాయనాడుకు పంపించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన వయనాడులో ఉండి పోతే వాయనాడ్ అమేథీ అవుతుందని పేర్కొన్నారు. ఆయన అమేథీ ఎంపీగా ఉన్నప్పుడు 80 శాతం మందికి కరెంట్ లేదు.
జిల్లా కలెక్టర్ కు ఆఫీసు లేదు. ఫైర్ స్టేషన్ లేదు. మెడికల్ కాలేజీ లేదు. కేంద్రీయ విద్యాలయం లేదు. సైనిక్ పాఠశాల, ఇండోర్ స్టేడియం లేదు. కానీ తనను గెలిపించాక అన్నీ ఒక్కటొక్కటిగా ఏర్పాటు చేస్తూ వచ్చానని చెప్పారు స్మృతీ ఇరానీ. ఇదిలా ఉండగా భారతీయ మజ్దూర్ సంఘ్ కేరళ యూనిట్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా కార్మిక సదస్సును ఆమె ప్రారంభించి ప్రసంగించారు.
Also Read : Lawrence Bishnoi