Mallikarjun Kharge : సోనియా గాంధీ కాంగ్రెస్ ను కాపాడిన దేవత
ప్రశంసలతో ముంచెత్తిన మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు పార్టీకి తాత్కాలిక చీఫ్ గా ఉన్న సోనియా గాంధీ ఇవాల్టి నుంచి మాజీ అధ్యక్షురాలిగా మిగిలి పోయారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీనియర్ నాయకులు హాజరయ్యారు.
భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకుని రాహుల్ గాంధీ హాజరు కావడం విశేషం. అంతకు ముందు తాను పదవి నుంచి దిగి పోయే కంటే ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ. ఎన్నో ఆటుపోట్లు, ఎత్తు పల్లాలు చూశానని కానీ ఏనాడూ ఓటమిని ఒప్పు కోలేదని కుండ బద్దలు కొట్టారు.
ఇవాల్టి నుంచి తనపై ఉన్న బరువు పూర్తిగా తొలగి పోయిందన్నారు. ఎంతో అనుభవం కలిగిన నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అని ప్రశంసించారు. ఆయన సారథ్యంలో పార్టీ మరింత ముందుకు వెళుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. అనంతరం మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు.
కూలీ కొడుకు ఇవాళ 137 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యాడని తన గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇదే సమయంలో సోనియా గాంధీని ఆకాశానికి ఎత్తేశారు. సోనియా గాంధీ లేక పోతే కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. కష్ట కాలంలో పార్టీని ఆదుకున్న ఘనత ఆమెదేనని పేర్కొన్నారు.
Also Read : రాహుల్ పాదయాత్రలో ఉద్దవ్..పవార్