Stephen Ravindra : ఎమ్మెల్యేల ఆపరేషషన్ ఆకర్ష్ గుట్టు రట్టు
రూ. 15 కోట్ల నగదు బట్ట బయలు - స్టీఫెన్
Stephen Ravindra : తెలంగాణలో భారీ ఆకర్ష్ గుట్టు రట్టయింది. ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 3న ఉప ఎన్నికకు దగ్గర పడుతుండడంతో కోట్లాది రూపాయలు బట్ట బయలు అవుతున్నాయి.
ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ , తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి భారీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నం విఫలమైంది.
ఇందుకు సంబంధించి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర(Stephen Ravindra) స్పందించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల కొనుగోలుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వారు ఇచ్చిన సమాచారంతోనే దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్ రాష్ట్రంలో కలకలం రేపింది. హైదరాబాద్ శివారు లోని మోయినాబాద్ ఫాం హౌజ్ లో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
ఆ ఆపరేషన్ ఆకర్ష్ లో నలుగురు మధ్యవర్తులు పాల్గొన్నారు. వీరి వద్ద నుంచి రూ. 15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్టీఫెన్ రవీంద్ర చెప్పిన వివరాల ప్రకారం వీరిలో ఒక స్వామీజీ కూడా ఉన్నారు.
హైదరాబాద్ కు చెందిన నంద కుమార్ కూడా ఉన్నారని వెల్లడించారు. కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ప్రలోభాలకు గురి చేశారని తెలిపారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా ఫాం హౌజ్ లో మధ్యవర్తులు చర్చలు జరిపిన ఎమ్మెల్యేలలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్దన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతా రావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. ఈ డీల్ రూ. 100 కోట్లకు కుదిరినట్లు సమాచారం.
Also Read : గవర్నర్ పై ‘గులాబీ’ గుస్సా