Street Dog Attack: గుంటూరులో విషాదం ! వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు మృతి !

గుంటూరులో విషాదం ! వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు మృతి !

Street Dog Attack : గుంటూరులోని స్వర్ణ భారతి నగర్ లో విషాదం నెలకొంది. ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఆపేందుకు ఎవ్వరూ లేకపోవడంతో తీవ్రంగా గాయపరిచింది. ఈ దాడిలో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతరం గుంటూరు జిల్లా(Guntur) ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Street Dog Attack on 4 years old Child

గుంటూరులోని స్వర్ణ భారతి నగర్ కు చెందిన నాగరాజు, రాణి దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడు ఐజాక్‌ తో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాణి ఇంట్లో పని చేస్తుండగా… నాగరాజు పని నిమిత్తం బయటకు వెళ్లారు. బాలుడు ఐజాక్ ఇంటి ఎదుట ఒంటరిగా ఆడుకుంటున్నాడు. అయితే ఐజాక్ వద్దకు వచ్చిన ఓ శునకం దాడి చేయడం మెుదలుపెట్టింది. ఆపేందుకు చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో బాలుడిని విపరీతంగా కరిచింది. దీనితో ఐజాక్ ముఖం, కాళ్లు, చేతులు, పొట్ట భాగాలపై విపరీతంగా గాయాలు అయ్యాయి. కాసేపటికి చిన్నారి కేకలు విన్న తల్లి రాణి ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టింది. తన కుమారుడిని శునకం కిందపడేసి కరుస్తున్న దృశ్యాలు చూసి చలించిపోయింది. వెంటనే అక్కడున్న కర్ర తీసుకుని కుక్కను తరిమేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెపైనా దాడి చేసేందుకు యత్నించింది ఆ శునకం. రాణి కేకలు విన్న చుట్టుపక్కల ఇళ్లవారు వెంటనే బయటకు వచ్చి కుక్కను తరిమేశారు.

బాలుడు ఐజాక్‌ ను హుటాహుటిన గుంటూరు(Guntur) ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి నాగరాజు సైతం ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయితే కుక్క దాడిలో తీవ్రంగా గాయపడడంతో ఐజాక్ ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు మృతితో నాగరాజు, రాణి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మృతిచెందడంతో గుండెలు పగిలేలా రోదించారు. దీనితో ఆస్పత్రి ఆవరణలోనే రాణి సొమ్మసిల్లి పడిపోయింది. వారి పరిస్థితిని చూసిన స్థానికులు సైతం కన్నీరు పెట్టుకున్నారు.

Also Read : CM Revanth Reddy: సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యం భోజనం చేసిన సీఎం రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!