తిరుమల : తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు కూడా ఇవ్వాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కోరారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను తొలిసారిగా సందర్శించిన ఈవో సేవకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం సేవకులతో సమావేశమై అన్న ప్రసాదం, పరిశుభ్రత, క్యూలైన్ నిర్వహణ తదితర అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నిత్యం తిరుమలకు వచ్చేసే భక్తులకు ప్రత్యక్షంగా సేవలందించే సేవకులు వారి సమస్యలను బాగా అర్థం చేసుకోగలరని అన్నారు. అందువల్ల వారు అందించే సూచనలు ఎంతో విలువైనవని ఈవో పేర్కొన్నారు.
సేవకులు అందించే ఫీడ్‌బ్యాక్ భక్తుల సౌకర్యాల అభివృద్ధికి, వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి కీలకంగా ఉపయోగ పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకు ముందు ఈవో సేవా సదన్-2లోని రిసెప్షన్, వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ కౌంటర్లను సందర్శించి, సేవకులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అలాగే హాల్స్‌ను తనిఖీ చేశారు. అనంతరం కొంతమంది సేవకులతో మాట్లాడగా వారికి అందుతున్న సౌకర్యాలపై సేవకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి.రవి, శ్రీవారి సేవా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
అంతకు ముందు కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను సందర్శించారు. పచ్చదనం, పరిశుభ్రత పాటించాలని సూచించారు. భక్తులు సైతం టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులకు సహకరించాలని కోరారు. స్వామి వారి దర్శనం అయ్యేంత వరకు సంయమనం పాటించాలని హితవు పలికారు.
