Supreme Court : 14న మోర్బీ వంతెన ప్రమాదంపై విచారణ
పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు
Supreme Court : దేశ వ్యాప్తంగా విస్తు పోయేలా చేసింది ఆదివారం సాయంత్రం గుజరాత్ లోని మోర్బీ బ్రిడ్జి(Morbi Bridge) కూలిపోయిన ఘటన. ఈ ఘోర ప్రమాదంలో 141 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 171 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా తప్పి పోయిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ దళాలు గాలింపు చర్యల్లో మునిగి పోయాయి.
రష్యాతో పాటు పలు దేశాల అధిపతులు ఈ ఘోర ప్రమాదంపై స్పందించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేస్తూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ మొత్తం ఘటనకు పూర్తి బాధ్యత అధికారుల, పాలకుల నిర్లక్ష్యమేనంటూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలైంది.
దాఖలైన దావాపై నవంబర్ 14న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court). సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ఎదుట మంగళవారం న్యాయవాది విశాల్ తివారి తన వాదనలు వినిపించారు. న్యాయ విచారణ చేపట్టాలని కోరుతున్నట్లు తెలిపారు.
150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది ఈ మోర్బీ వంతెనకు. కొద్ది రోజుల కిందట మరమ్మతుల కోసం మూసి వేశారు. దీని బాధ్యతలను ఒరేవా గ్రూప్ నకు అప్పగించింది ప్రభుత్వం. గత వారంలో ఛత్ పూజ కోసం తిరిగి తెరిచారు. దీంతో ఒక్కసారిగా 500 మంది వంతెనపైకి రావడంతో కుప్ప కూలింది.
ఇదిలా ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చని పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, రూ. 2 లక్షలు , గాయపడిన వారికి రూ. 50 ,000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.
Also Read : బ్రిడ్జి కూలిన ఘటనపై మోదీ కీలక సమీక్ష