Supreme Court : దేవాలయంలో వీఐపీ దర్శనాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా..

Supreme Court : దేవాలయాల్లో వీఐపీ దర్శనాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దేవాలయాలలో వీఐపీలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యవహారాన్ని నిరోధించేలా మార్గనిర్దేశకాలను జారీ చేయలేమని సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం స్పష్టం చేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.

Supreme Court Of India Orders

దర్శనాల్లో ప్రాధాన్యతలు ఇవ్వకూడదనే అభిప్రాయం తమకూ వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ, ఈ విషయంలో మార్గనిర్దేశకాలు జారీ చేయడానికి న్యాయస్థానానికి వీలు లేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమస్యను నిర్ణయించాల్సింది సమాజంతోపాటు ఆలయ నిర్వహణ అని స్పష్టం చేసింది. దీనిపై కోర్టు ఎటువంటి దిశానిర్దేశం చేయలేదని పేర్కొంది. అయితే ఈ అంశంపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడానికి తమకు ఎలాంటి అడ్డంకీ లేదని వివరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం న్యాయస్థానం వీఐపీ దర్శనాలపై మార్గనిర్ధేశకాలు జారీ చేయలేదని ధర్మాసనం తెలిపింది.

దేవాలయాల్లో వీఐపీ దర్శనాలపై నిషేధం విధించాలంటూ బృందావన్‌లోని శ్రీ రాధా మదన్ మోహన్ ఆలయంలో ‘సేవక్’ విజయ్ కిషోర్ గోస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దేవాలయాల్లో వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే పలు సందర్భాల్లో తొక్కిసలాటలు చోటుచేసుకొంటున్నాయని.. ఈ అసమానతలు తొలగించాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉందంటూ పిటిషనర్.. తాను దాఖలు చేసిన పిటిషన్‌లో స్పష్టం చేశారు.

ఈ ఆచారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 21లో పొందుపరిచిన సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తుందని, రుసుము చెల్లించలేని భక్తులపై వివక్ష చూపుతుందని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక దర్శనం పేరుతో రూ.400 నుంచి రూ.500 మధ్య రుసుము వసూలు చేయడం వల్ల సంపన్న భక్తులకు ఆ యా ఛార్జీల భారం భరించలేని వారికి.. మరి ముఖ్యంగా వెనుకబడిన మహిళలు, వికలాంగులతోపాటు సీనియర్ సిటిజన్ల మధ్య తీవ్ర అంతరం ఏర్పడిందని సదరు పిటిషన్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ సమాన ఆదరణ లభించేలా ఆదేశాలు ఇవ్వడంతోపాటు దేవాలయాల్లో అందరికి సమాన ప్రవేశం ఉండేలా కేంద్రం ప్రామాణిక విధి విధానాలు రూపొందించాలని అందులో కోరారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల నిర్వహణ, పరిపాలనను పర్యవేక్షించడానికి జాతీయ బోర్డును ఏర్పాటు చేయాలని సైతం ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పై విధంగా నిర్ణయం తీసుకొంది.

Also Read : PM Narendra Modi : ఈ బడ్జెట్ వికసిత్ భారత్ కు ప్రాముఖ్యతనిచ్చేలా ఉంటుంది

Leave A Reply

Your Email Id will not be published!