భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక రకంగా నిప్పులు చెరిగింది. ఏడుగురు మహిళా రెజ్లర్లు తమకు న్యాయం చేయాలని కోరుతూ మరోసారి దేశ రాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. తాము లైంగిక వేధింపులకు గురయ్యామంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు.
తమను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రెజ్లర్లు ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు పట్టించు కోలేదు. దీనిపై బాధిత మహిళా రెజ్లర్లు తమకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా పిటిషన్ లో చీఫ్ పై ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు పట్టించు కోలేదని వాపోయారు. డబ్ల్యూఎఫ్ చీఫ్ పై కేసు నమోదు చేసేలా ఖాకీలను ఆదేశించాలని కోరారు.
దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతే కాదు వాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎందుకు కేసు నమోదు చేయలేదో తమకు నివేదించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.