Supreme Court : కేంద్రం నిర్వాకం సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యాయమూర్తుల నియామకం జాప్యం
Supreme Court : దేశంలో అంతిమ నిర్ణయం ఎవరిది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా గత కొంత కాలం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది.
ఇందులో భాగంగానే కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఈ మధ్యన న్యాయ వ్యవస్థపై బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఊహించని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
తాజాగా న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వం కావాలని జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగైతే న్యాయ వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించింది. ప్రభుత్వం తన పరిమితులను దాటుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా చట్టం ముందు సమానులేనని, అది ఉన్నంత వరకు అమలు చేయాల్సి తీరాల్సిందేనంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు(Supreme Court).
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫారసు చేసిన పేర్లను ఫైనల్ చేయకుండా తొక్కి పెట్టడంపై ధర్మాసనం ఏజీ ఆర్. వెంకటరమణిపై సీరియస్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు లేదా అనుమానాలు ఉంటే తెలియ చేయాలి కానీ ఇలా జాప్యం చేస్తే ఎలా అని నిలదీసింది.
ఇదిలా ఉండగా కేంద్రం ఉద్దేశ పూర్వకంగానే ఆలస్యం చేస్తోందంటూ జస్టిస్ ఎస్ కే కౌల్ , జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఆరోపించింది. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి పరాయి జీవి అన్న కామెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం.
Also Read : గుజరాత్ ఎన్నికల విరాళాల్లో బీజేపీ టాప్