Supreme Court of India : జైళ్లలో కుల వివక్షపై సంచలన తీర్పునిచ్చిన ధర్మాసనం
కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనులను అప్పగిస్తున్నారు...
Supreme Court : జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. జైళ్లలో కుల ఆధారిత వివక్ష, విభజన ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి చర్యలు అంటరానితనం కిందకే వస్తాయని పేర్కొంది. కులం ఆధారంగా ఖైదీలను వేరుగా ఉంచడం మార్పు తీసుకురాదని, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించడం వలసవాద వ్యవస్థకు చిహ్నమని వెల్లడించింది.
Supreme Court of India Orders…
“కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనులను అప్పగిస్తున్నారు. జైలులో గదుల కేటాయింపునకు సంబంధించిన నిబంధనలు సరికావు. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే క్లీనింగ్ పనులు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. కింది కులాల ఖైదీలకు మాత్రమే శుభ్రపరిచే పని, అగ్రవర్ణ ఖైదీలకు వంట పనులు ఇవ్వడం ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమే. అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మూడు నెలల్లో మార్చాలి. ఈ నిర్ణయం అమలుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టులో సమర్పించాలి” అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఖైదీలపై వివక్షకు కులం కారణం కారాదని, అలాంటి వాటిని అనుమతించేది లేదని తెలిపింది. పని విషయంలో అందరికీ సమాన హక్కు కల్పించాలని వివరించింది. ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసే పనులకు ఖైదీలను అనుమతించకూడదని సూచించింది. ఒక కులం వారినే స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని వివరించింది.
Also Read : Minister Kishan Reddy : ఫోన్ ట్యాపింగ్ చేసి ఒకరి సంభాషణ వినడం అనేది చాలా పెద్ద నేరం