Supreme Court: లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court : మహిళల దుస్తులు లాగడం, ఛాతీ భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదని, బలవంతపెట్టడం లేదా వివస్త్రను చేసే యత్నంగానే పరిగణించాలన్న అలహాబాద్ హైకోర్టు(Alahabad High Court) జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ‘స్టే’ విధించింది. హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమానవీయమైన, క్రూరమైనదిగా అభివర్ణించింది. న్యాయ సూత్రాలకు పొసగని ఈ వివాదాస్పద తీర్పును తీవ్రంగా పరిగణిస్తున్నామని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court Slams Alahabad High Court
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం(Supreme Court) సుమోటోగా స్వీకరించి బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి గురించి తీవ్ర పదజాలాన్ని వినియోగించాల్సి రావడం పట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ‘‘అలహాబాద్ హైకోర్టు తీర్పు కాపీ చదువుతుంటే బాధేస్తోంది. ఇదొక సున్నితమైన అంశం అనే పట్టింపులేకుండా తీర్పు ఇచ్చారు. ఇదేదో క్షణికావేశంలో చేసింది కూడా కాదు. తీర్పును నాలుగు నెలలపాటు రిజర్వ్ చేసి మరీ వెల్లడించారు. అంతే… సరైన స్పృహతోనే ఈ తీర్పు వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తీర్పుపై స్టే విధించేందుకు మేం బాగా ఆలోచిస్తుంటాం. కానీ, తీర్పు కాపీలోని 21, 24, 26 పేరాలు చదివాక… అమానుషంగా అనిపించింది. అందుకే స్టే విధిస్తున్నాం. దుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇది వర్తిస్తుంది.’’ అని సుప్రీం కోర్టు వెల్లడించింది.
ధర్మాసనం వ్యాఖ్యలతో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం ఏకీభవించారు. ఈ తరుణంలో జస్టిస్ గవాయ్ కలుగజేసుకుని ఇది తీవ్రమైన అంశం. సున్నితమైన అంశంగా భావించకుండా సదరు జడ్జి తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయి. ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించాలి’’ అని తుషార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు సుమోటో విచారణపై స్పందించాల్సిందిగా కేంద్రం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టు కేసులోని ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద తీర్పు వెలువరించిన జడ్జిపై తీసుకోవాల్సిన చర్యలేమిటో నిర్ణయించాల్సింది అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తేనని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.
కేసు పూర్వాపరాలివి
2021 నవంబరులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కసగంజ్‌లో ఓ బాలికను ఇంటి దగ్గర దింపుతామంటూ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్న యువకులు మార్గమధ్యంలో ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాలిక అరుపులు విన్న స్థానికులు అక్కడకు రావడంతో నిందితులు పరారయ్యారు. ప్రత్యేక కోర్టు అత్యాచార నేరం కింద సమన్లు జారీ చేయగా నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. మార్చి 17న విచారణ జరిపిన జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా… నిందితుల చర్య అత్యాచార నేరం కిందకు రాదని, బలవంతపెట్టే లేదా వివస్త్రను చేసే దాడిగానే పరిగణించాలంటూ ఉత్తర్వులో పేర్కొన్నారు. జడ్జి వ్యాఖ్యలతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్తోందనే ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమయ్యింది. దీనిపై కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పందిస్తూ… ఇలాంటి తీర్పుల వలన న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారడమే కాకుండా… లైంగిక వేధింపుల కేసుల్ల నిందితులకు ఆసరా ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసారు.
Also Read : Vande Bharat Train: త్వరలో కశ్మీర్ లోయలో పరుగులు పెట్టనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్