Supreme Court: కంచగచ్చిబౌలిలో పచ్చదనాన్ని పునరుద్ధరిస్తారా ? లేక జైలుకెళ్తారా?

కంచగచ్చిబౌలిలో పచ్చదనాన్ని పునరుద్ధరిస్తారా ? లేక జైలుకెళ్తారా?

Supreme Court : హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం చెట్లు కొట్టేసే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనితో ఏప్రిల్‌ 3న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై సుప్రీం ఆదేశాల మేరకు… 263 పేజీలతో కూడిన సుదీర్ఘ అఫిడవిట్‌ను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. సుమోటో కేసుతోపాటే బీ ద చేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ సైతం దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మాసి్‌హలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం(Supreme Court) విచారణ చేపట్టింది. అమికస్‌ క్యూరీలు పరమేశ్వర్‌, గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌, తెలంగాణ(Telangana) ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వి, మేనక గురుస్వామి, బీ ద చేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌ రావు, భారత ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తుషార్‌ మెహతా, ఇంప్లీడ్‌ పిటిషన్‌ ద్వారా సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు.

Supreme Court Of India Order

ఈ సందర్భంగా కంచ గచ్చిబౌలి(Kanchagachibowli) భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘‘కంచగచ్చిబౌలిలోని వందెకరాలను పునరుద్ధరిస్తారా ? లేక జైలుకెళతారా?’’ అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని హెచ్చరించింది. కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా? అనే ప్రశ్నకు సూటిగా జవాబివ్వాలని నిలదీసింది. ‘‘మీరు పెద్దఎత్తున చెట్లను కొట్టివేస్తే… ఆవాసం కోసం జంతువులు పరుగులు తీశాయి. వాటిని వీధికుక్కలు తరిమాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి మాకెంతో ఆందోళన కలిగింది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘‘పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య సమతౌల్యం అవసరం. ఇష్టమొచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదు. ఆ వందెకరాలనూ ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. లేదంటే జైలుకెళ్లేందుకు సీఎస్‌ సహా అధికారులు సిద్ధంగా ఉండాలి. అక్కడే కొలను దగ్గర ఆరు నెలల్లో తాత్కాలికంగా జైలు నిర్మించి అందరినీ అందులో ఉంచుతాం.’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది.

అయితే కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవేనని, అక్కడ అటవీ భూమి లేదని తెలంగాణ(Telangana) ప్రభుత్వం తరఫున అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్‌ తరహా చెట్లు, ఇతర పొదల్ని తొలగించామని తెలిపారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు(Supreme Court) సమర్పించామని గుర్తుచేశారు. ఇంతలో అమికస్‌ క్యూరీ పరమేశ్వర్‌ జోక్యం చేసుకుని… తెలంగాణలో వాల్టా చట్టం ఉందని, దాన్ని సైతం విస్మరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి జస్టిస్‌ గవాయి… అనుమతులు తీసుకోకపోతే సీఎస్‌ సహా సంబంధిత అధికారులు అందరినీ జైళ్లకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే, ఆ భూమి కోసం 2004 నుంచి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోందని అభిషేక్‌ మను సింఘ్వి తన వాదనలను కొనసాగించారు.

2024లో అది తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఇన్నేళ్లుగా ఆ భూమిపై ఎవరు మాట్లాడలేదని, కానీ తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ)కి భూమిని కేటాయించిన తర్వాతే ఆ భూమి అటవీ శాఖదనే వాదన పుట్టుకొచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో అక్కడ పనులు ప్రారంభించిందని, కానీ కొందరు కావాలనే అసత్య ప్రచారాలతో అందరినీ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దీనికి జస్టిస్‌ గవాయి… చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారో లేదో చెప్పాలని, అంతేతప్ప వందెకరాల్లో చెట్లను తొలగించడాన్ని సమర్థించుకోవద్దని హెచ్చరించారు.

పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని విచారణ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘చెట్ల నరికివేత తీవ్రమైన అంశం. పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా చెట్లను నరికివేశారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పండి. వారాంతపు సెలవుల్లో మూడు రోజుల్లో అంత హడావుడిగా చెట్లు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? డజన్ల కొద్దీ బుల్‌డోజర్లతో అడవిని వంద ఎకరాల్లో అత్యవసరంగా తొలగించాల్సిన అత్యవసమేంటో చెప్పండి? సరిహద్దుకు సులభమైన అనుసంధానం కల్పించే, దళాల కదలికను తెలిపే చార్‌ధామ్‌ రోడ్ల వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కోర్టులో సంవత్సరాల తరబడి పోరాడాల్సి వచ్చింది.

మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కేసు రెండు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో(Supreme Court) ఉంది’’ అని పేర్కొంది. ముంబై, చెన్నై, హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లోని అటవీ భూములను కాపాడుకోపోతే ఎలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తమకు ప్రభుత్వాల గురించి ఆందోళన లేదని.. కేవలం మూడు రోజుల్లో 100 ఎకరాలను నాశనం చేయడానికి డజన్ల కొద్దీ బుల్‌డోజర్లను మోహరించడం గురించి మాత్రమే తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. ‘‘అవసరమనుకుంటే.. వందెకరాలే కాదు, అక్కడ 2,400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టొద్దని ఆదేశాలివ్వాల్సి వస్తుంది…’’ అని ధర్మాసనం హెచ్చరించింది.

ప్రైవేటు అటవీ భూముల్లో చెట్లు కొట్టేయాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే

ఈ భూమిని తాకట్టు పెట్టిన విషయాన్ని తెలంగాణ సీఎస్‌ తన అఫిడవిట్‌లో పేర్కొనలేదని అమికస్‌క్యూరీ పరమేశ్వరన్‌ చేసిన వాదనలతో జస్టిస్‌ గవాయ్‌ విభేదించారు. ‘‘ఈ భూమి యాజమాన్య హక్కులు ఎవరివన్న విషయం జోలికి మేం వెళ్లడంలేదు. దాన్ని ధ్రువీకరించే అధికారం సీఈసీకి లేదు. అక్కడ చెట్లు కొట్టేశారా? లేదా? ఒకవేళ కొట్టేసి ఉంటే అందుకు అనుమతులున్నాయా? లేదా? అనుమతులు లేకుండా ఎన్ని చెట్లు కొట్టేశారు ? అన్నది చూడటం వరకే సీఈసీ బాధ్యత. ప్రైవేటు అటవీ భూముల్లో చెట్లు కొట్టేయాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. ముంబయిలోని ఆరే ప్రాంతంలో మెట్రో డిపో నిర్మాణానికి హైకోర్టు అనుమతిచ్చిన తర్వాతే చెట్లు కొట్టేయాల్సి వచ్చింది.

Also Read : Amur Falcon: 22వేల కిలోమీటర్ల ప్రయాణం చేసిన రేడియో-ట్యాగ్ చేసిన ఫాల్కన్ పక్షి

Leave A Reply

Your Email Id will not be published!