Supreme Court Collegium : కొలీజియంపై విచారణకు సుప్రీం ఓకే
న్యాయవాది నెదుంపారా దావా దాఖలు
Supreme Court Collegium : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానంతో పాటు దేశంలోని హైకోర్టుల్లో సీజేఐ, ఇతర ప్రధాన న్యాయమూర్తులు, జడ్జీల ఎంపికకు సంబంధించి అనుసరిస్తున్న కొలీజియం(Supreme Court Collegium) వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంచలన ఆరోపణలు కూడా చేశారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఇండియాలోనే కొలీజియం వ్యవస్థ ఉందన్నారు. ఏ వ్యవస్థ అయినా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతుందని కానీ ప్రత్యేకించి న్యాయ వ్యవస్థలో భిన్నంగా ఉందని వాపోయారు. అంతే కాకుండా ఆయన న్యాయమూర్తులపై కూడా మండిపడ్డారు. కోర్టుల తీర్పుల కంటే రాజకీయాలు చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపికకు సంబంధించి అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను న్యాయవాది మాధ్యూస్ జే నెదుంపారా దాఖలు చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ సరిగా లేదని పేర్కొన్నారు.
అర్హులైన వారిని న్యాయమూర్తులుగా సిఫారసు చేయడం లేదని ఆరోపించారు పిటిషనర్. న్యాయమూర్తుల ఎంపికకు సంబంధించి ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని , ఆ తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా భర్తీ చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.
ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ వల్ల నష్టం తప్ప మేలు చేకూరడం లేదని ఆరోపించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
Also Read : ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు