Supreme Court: వక్ఫ్ చట్టంపై నమోదైన పిటిషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
వక్ఫ్ చట్టంపై నమోదైన పిటిషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court : వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో(Supreme Court) దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. సుమారు 73 పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రం తరఫు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం నుంచి వివరణ తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో విస్తృత చర్చ జరిగిన తర్వాతే చట్టానికి ఆమోదం లభించిందని, జాయింట్ పార్లమెంటు కమిటీ పరిశీలన తర్వాతే ఉభయ సభల్లో తిరిగి ఆమోదం పొందిందని తుషార్ మెహతా చెప్పారు. వక్ఫ్ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకికమైన స్వభాన్ని కలిగిఉందని చెప్పింది. అలాగే కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. వందల ఏళ్లనాటి ఆస్తులకు పత్రాలు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించింది. వక్ఫ్ చట్టంపై(Waqf Bill) ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించింది.
Supreme Court Of India Respond
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలో కొత్త చట్టం కలెక్టర్ కు ఇచ్చే అధికారాలను ప్రశ్నించారు. కలెక్టర్ కూడా ప్రభుత్వంలో భాగమైనప్పుడు ఆయన న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఒక పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ అబిషేక్ మను సింఘ్వి తన వాదన వినిపిస్తూ… దేశంలో 8 లక్షల వక్ఫ్ ప్రాపర్టీలలో వక్ఫ్ బై యూజర్ ప్రాపర్టీలు 4 లక్షలు ఉన్నాయన్నారు. దీనిపై సీజేఐ జోక్యం చేసుకుంటూ ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలో కట్టామంటున్నారని, అన్ని వక్ఫ్ బై యూజర్ లు తప్పని తాము చెప్పుడం లేదని, అయితే కొన్ని సహజమైన ఆందోళనలను కూడా ఉన్నాయని అన్నారు. దీనిపై సింఘ్వి స్పందిస్తూ, మొత్తం చట్టం మీద తాము స్టే కోరడం లేదని, కొన్ని ప్రొవిజన్లపై స్టే కోరుతున్నామని అన్నారు. అనంతరం విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
ఆలయ బోర్డులలో ముస్లింలకు చోటిస్తారా ? – కేంద్రానికి సుప్రీం సూటిప్రశ్న
కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ లలో ముస్లిమేతరలను చేర్చే నిబంధనను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. హిందూ ఎండోమెంట్ బోర్డులలో ముస్లింలు భాగం కావడానికి కేంద్రం అనుమతిస్తుందా అని సూటిగా ప్రశ్నించింది. వక్ఫ్‌లోని చాలా మసీదులు 13,14,15వ శాతాబ్దానికి చెందినవి కూడా ఉన్నాయని, వాటి డాక్యుమెంట్లు తెమ్మంటే ఎలా సాధ్యం ? అని ప్రశ్నించారు.
Also Read : Mamata Banerjee: అమిత్ షాను కంట్రోల్ చేయండి – ప్రధాని మోదీకి మమత సూచన