Ashish Mishra : ఆశిష్ మిశ్రా బెయిల్ పై సుప్రీం నోటీస్
యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ
Ashish Mishra : రైతులను చంపిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్ మిశ్రా బెయిల్ పిటిషన్ పై యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని తదుపరి విచారణను సెప్టెంబర్ 26కి వాయిదా వేసింది. ఈ కేసులో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
ఇదిలా ఉండగా లఖింపూర్ ఖేరి హింసాకాండ కేసుకు సంబంధించి తనకు బెయిల్ నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆశిష్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం మంగళావరం యూపీకి నోటీసులు జారీ చేసింది.
జూలై 26న అలహాబాద్ హైకోర్టు ఆశిష్ మిశ్రాకు(Ashish Mishra) బెయిల్ నిరాకరించింది. బెయిల్ ను హైకోర్టు లక్నో బెంచ్ తిరస్కరించింది. ఈ ఆదేశాలను ఆశిష్ మిశ్రా సవాల్ చేశారు.
అడ్వకేట్ ఆన్ రికార్డ్ టి. మహిపాల్ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లఖింపూర్ ఖేరి కేసులో నలుగురు రైతులు మరణించారు. ఓ జర్నలిస్ట్ కూడా బలయ్యాడు.
మరికొందరు గాయాల పాలయ్యారు. నిందితుల కారు అక్కడే ఉంది. ఈ కేసు ఘోరమైన నేరం కిందకు వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా అక్టోబర్ 3, 2021న లఖింపూర్ ఖేరిలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించిన సంఘటనకు సంబంధించి ఆశిష్ మిశ్రా హత్య కేసును ఎదుర్కొంటున్నారు.
అక్టోబర్ 9న అరెస్ట్ అయ్యాడు. ఫిబ్రవరి 2022లో బెయిల్ పొందాడు. వారం రోజుల్లో లొంగి పోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read : సహకార విధాన ముసాయిదా కోసం ప్యానల్